BJP MLA Raghunandan Rao: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందరన్ రావు తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. దీనికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని.. ఎవరినీ కొట్టరని చెప్పుకొచ్చారు. ఆటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మాత్రమే దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి తన కుమారుడిని కొట్టారంటూ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. మల్లారెడ్డి కుమారుడు ఆశ్వస్థతకు గురవ్వడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు షాకింగ్ కామెంట్లు చేశారు. నోటీసులు ఇస్తే చాలు.. గుండె నొప్పి అంటూ ప్రతీ ఒక్కరూ ఆసుపత్రికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 



నోటీసులు రాంగనే గుండె నొప్పి ఎందుకు వస్తుందో..


"కుమారుడికి అస్వస్థత రాజకీయ కుట్ర అయితే అయ్యుంటది మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు. ఎందుకంటే గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికి నోటీసులు ఇచ్చిన ఈ మధ్యన గుండెనొప్పి వచ్చిందని దావఖానాకు పోతా ఉన్నారు. నేను ఒక 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్‌గా నాదొక ప్రశ్న.. నిన్న మొన్నటి దాకా బాగున్న ఒక వ్యక్తి, నిన్న పొద్దుగాల వాకింగ్ చేసినటువంటి వ్యక్తి, మంచిగ ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి.. ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు రాంగనే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకర్థమైతలేదు. బాధ్యత గల మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నా కొడుకును రాతిరంతా కొట్టినట్టున్నరు అన్నరు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తరు, సంబంధించి ఏమన్న జవాబులు చెప్పమని అడుగుతరు తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తరని నేను అనుకుంటలే." - ఎమ్మెల్యే రఘునందన్ రావు


ఫోన్ ను చెత్తబుట్టలో, ఫైళ్లను పక్కింట్లో ఎందుకు దాచిపెట్టిర్రు..


"ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నాయన రాజకీయ కోణంలో మాట్లాడడం అనేది బాధాకరమైన విషయం. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్.. ఇలా ఏ నాయకులైనా సరే చట్టం ముందు సమానమే. మంత్రి మల్లారెడ్డి దగ్గర పని చేసి ఆయనతో విబేధించి పోయినోళ్లు ఐటీ వాళ్లకు ఫిర్యాదు చేసినట్లు మాకు సమాచారం. సెల్ ఫోన్ తీస్కపోయి చెత్తబుట్టలో వేయడం, ఫైళ్లు తీస్కపోయి పక్కింట్లో దాచి పెట్టుకోవడం చేస్తున్నరంటేనే.. మీరేదే చేస్తున్నరనే అనుమానం వస్తుంది. " - ఎమ్మెల్యే రఘునందన్ రావు


అంతే కాకుండా సోమవారం రోజు ఉదయమే మంత్రి మల్లారెడ్డి కుమారుడు.. వాకింగ్ కి వెళ్లాడని.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీకీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. అలాగే మంత్రి మల్లారెడ్డి తన ఫోన్ ను ఎందుకు చెత్త బుట్టలో దాచిపెట్టారో చెప్పాలన్నారు. ఫోన్ లు దాచారంటేనే వారు తప్పు చేసినట్లు తెలుస్తోందని అన్నారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి బదులుగా.. ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రులు చుట్టూ తిరగడం దారుణం అన్నారు. విచారణకు భయపడే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.