Revanth Reddy : భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీనివాసరావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని విమర్శించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అందుకే ఫారెస్ట్ అధికారులు, పోడు భూముల సాగుచేస్తున్న గిరిజనులకు మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతో నిజాయితీ గల  ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తామని 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను మభ్యపెడుతోందన్నారు.  


పట్టాలిస్తామన్న హామీ ఏమైంది? 


అటవీ భూములను సాగు చేస్తున్నారని గిరిజనులపైకి అధికారులను పంపిస్తూ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయన్నారు. పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం, గిరిజనులు అడ్డుకోవడం వారి మధ్య ఘర్షణలు జరగడం నిత్యం జరుగుతున్నాయని లేఖలో తెలిపారు. ఈ క్రమంలో వేలాది మంది గిరిజనులపై ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనుల ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసి మూడేళ్లు గడిచిందని గుర్తుచేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కారానికి గతేడాది సెప్టెంబర్ 16న మంత్రి సత్యవతి రాథోడ్ ఛైర్‌ పర్సన్‌గా కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీని నియమించి 14 నెలలు గడుస్తున్నా నివేదిక సిద్ధం చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 


పాడె మోసిన మంత్రులు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు మృతదేహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని చెప్పినట్లు వివరించారు. ప్రభుత్వం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించేది లేదని మంత్రులు తెలిపారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని... నిందితులను చాలా కఠినంగా శిక్షించేలా చేస్తామన్నారు.  


దోషులను కఠినంగా శిక్షిస్తాం


ఎఫ్ఆర్ఓ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ఎఫ్ ఆర్ వో అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే మంత్రులు, అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రులు స్వయంగా పాడె మోశారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని,ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.