Telangana News: తెలంగాణలో ఎన్నికలు సమర్థంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగు ఆదేశాలిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఇందులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌ వి నాయక్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దీపక్‌మిశ్ర, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఆర్‌.బాలకృష్ణన్‌ ఉన్నారు. ఈ క్రమంలో వారు తాజాగా రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ ఎన్నికల సంఘం కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.


'ర్యాండమైజేషన్ తప్పనిసరి'


పోలీసు సిబ్బందికి వారి పోలీసుస్టేషన్‌ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించాలని ప్రత్యేక పరిశీలకులు అధికారులకు సూచించారు. పోలింగ్‌ రోజున విధుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తాన్నీ ర్యాండమైజేషన్‌ చేయాలన్నారు. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు చేసిన వారి వివరాలను సెల్‌ఫోన్‌ నెంబరు సహా జిల్లాల వారీగా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని, పరిశీలకులు వారితో ఫోన్లో మాట్లాడుతూ ఫిర్యాదులను ఎంత మేరకు పరిష్కరించారో తెలుసుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగు ఏజెంట్లు విధిగా సీ-విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు సెల్‌ఫోన్‌లో కాకుండా వీడియో కెమెరాలతోనే ఆయా వ్యవహారాలను చిత్రీకరించాలని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున టీవీల్లో ప్రసారమయ్యే కథనాలను పర్యవేక్షించేందుకు ఆయా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక పరిశీలకులు అధికారులకు వివరించారు.


'నిఘా తీవ్రం చేయాలి'


ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల అధికారులు, పరిశీలకులు నిఘాను విస్తృతం చేసి ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాలని ఈసీ వ్యయ వ్యవహారాల డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ అజయ్‌ భదూ పేర్కొన్నారు. ఏజెన్సీలు, పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచితాల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని సూచించారు. సమావేశంలో ఈసీ వ్యయ వ్యవహారాల డైరెక్టర్‌ పంకజ్‌ శ్రీవాస్తవ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌, సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఉప ముఖ్య ఎన్నికల అధికారి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.


మరోవైపు, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ, నేతలు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వాహనాన్నీ క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తే తమ వెంట నగదుకు సంబంధించిన పత్రాలు తీసుకెళ్లాలని స్ఫష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.480.25 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ సహా ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు తీవ్రం చేశారు.


Also Read: Congress Third List Controversy: కాంగ్రెస్ లో మూడో జాబితా చిచ్చు - పటాన్ చెరులో ఉద్రిక్తత, జాబితాపై దామోదర రాజనర్సింహ అసంతృప్తి