Bandi Sanjay Comments on Telangana Election Results 2023: బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడితే చివరకు కాంగ్రెస్ పార్టీ లాభపడిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ పదేళ్ల మూర్ఖత్వపు పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, అందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని, ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేశారని విస్మయం వ్యక్తం చేశారు.
'కేసీఆర్ పై పోరాడాం'
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు బీజేపీ పోరాడిందని, అయితే 'హస్తం' పార్టీ అనూహ్యంగా లాభపడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనతో పాటు ఎంతో మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని, ఆ పార్టీ నేతలు దాడులు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తమను జైలుకు కూడా పంపారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను గెలుపోటముల ఆధారంగా పని చేయనని పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా పని చేస్తానని, తన లక్ష్యం బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు.
గంగుల చేతిలో ఓటమి
కరీంనగర్‌లో బండి సంజయ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 300కు పైగా ఓట్ల తేడాతో స్వల్ప ఆధిక్యంలో గెలుపొందారు. అయితే, రీకౌంటింగ్ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బండి సంజయ్ ప్రతిపాదనను ఈసీ అధికారులు తిరస్కరించారు.
Also Read: Barrelakka News: కొల్లాపూర్‌లో బర్రెలక్క స్థానం ఏంటీ? ప్రచారం ఎక్కువ ప్రభావం తక్కువైందా?