KCR And Revanth Reddy Defeated In Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక ఎత్తు. అక్కడ ఏకంగా ఇద్దరు స్టాల్‌వాల్ట్స్ పోటీ పడుతుండటంతో ఆ నియోజకవర్గంపై అందరి ఫోకస్ నెలకొంది. ఒకప్పుడు కామారెడ్డి అంటేనే అన్ని నియోజకవర్గాల మాదిరిగానే ఒక నియోజకవర్గం. కానీ అలాంటి చోట రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ లాంటి వ్యక్తి పోటీ చేయడం ఒక సంచలనం అయితే... అలాంటి కొండను ఢీ కొడుతోంది రేవంత్ అనేసరికి అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.
కామారెడ్డిలో బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ పోటీలో ఉంటే... కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాంటి ఇద్దరినీ బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ పడ్డారు. పోటీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఇక్కడ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ అక్కడ అనూహ్యంగా కేసీఆర్ మూడో స్థానానికి పరిమితం అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ మొదట్లో రేవంత్ ముందంజలో కనిపించినా చివరకు బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి విజయం సాధించారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఓడిపోయినా ఆ స్థానంలో కేసీఆర్‌ను ఓడించి సక్సెస్ అయ్యారు. కామారెడ్డి ప్రచారంలో ఎక్కడా గెలుస్తానంటూ రేవంత్ చెప్పలేదు. తాను మాత్రం కేసీఆర్‌ను ఓడిస్తానంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే కేసీఆర్‌ను ఓడించారు. ఇక్కడ బీజేపీ విజయంలో కాంగ్రెస్ హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొదటి నుంచి ఇక్కడ విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతూ వస్తోంది. కౌటింగ్ మొదలైనప్పటికీ రేవంత్ రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. ఈవీఎంల లెక్కింపు మొదలైన తొలుత వెంకటరమణారెడ్డి లీడ్‌లోకి వచ్చారు. తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు. చివర కౌంటింగ్ ముగిసే సరికి రేవంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. చివరకు 6741 ఓట్ల తేడాతో వెంకటరమణారెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 66652 ఓట్లు రాగా... రెండోస్థానంలో ఉన్న కేసీఆర్‌కు 59911 ఓట్లు పడ్డాయి. మూడో స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి.
ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించిన వెంకటరమణారెడ్డి ఒకప్పుడు బీఆర్‌ఎస్ లీడర్. ఆ పార్టీలో గుర్తింపు లేదని అలకబూని బీజేపీలో చేరారు. అలా చేరిన ఆయనకు టికెట్ కన్ఫామ్ అయినట్టు ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే రేవంత్, కేసీఆర్ మధ్యలో రమణారెడ్డి గెలుస్తారా అనే అనుమానం చాలా మందిలో కనిపించింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఎక్కడా కుంగిపోకుండా ప్రచారం చేశారు వెంకటరమణారెడ్డి. తాను లోకల్ అభ్యర్థిని అంటూ ప్రచారం చేశారు. మిగతా ఇద్దరు నాన్‌లోకల్ అభ్యర్థులని వారు గెలిస్తే మళ్లీ ఉపఎన్నికలు వస్తాయని తన స్టైల్‌లో డైలాగులతో పోటీలో ఉంటూ వచ్చారు.