Telangna aMinisters Loss: తెలంగాణవ్యాప్తంగా సగానికిపైగా మంత్రులు ఓటమిపాలయ్యారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు షాక్ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్‌, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్‌ తోపాటు ఆరుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. 


ఎర్రబెల్లి దయాకర్‌ విజయాలకు బ్రేక్
పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమిపాలయ్యారు. ఆరుసార్లుగా విజయాలు సాధిస్తూ వస్తున్న ఎర్రబెల్లి ఈసారి మాత్రం బోల్తాపడ్డారు. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన యశస్విని రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల వరకు టీడీపీ తరఫున పోటీ చేస్తూ విజయాలు సాధిస్తూ వచ్చిన ఎర్రబెల్లి... 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018లో గెలిచిన తర్వాత దయాకర్‌రావు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా ఐదుసార్లు విజయం సాధిస్తే... ఒక్కసారి బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. ఒకసారిగా ఎంపీగా కూడా విజయం సాధించారు. 


సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 
మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఆయనపై టీ మేఘారెడ్డి విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని ముద్దాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2018లో నిరంజన్‌రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఆది నుంచి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. 2014లో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ లీడర్‌ చిన్నారెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. చివరకు ఆయన 2018లో ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూ రాజకీయం చేసిన మేఘారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 


పువ్వాడ అజయ్‌ కు షాక్
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు చేతిలో అజయ్‌ ఓటమి పాలయ్యారు. 2018లో టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తే ఆయనపై పువ్వాడ అజయ్ విజయం సాధించారు. 2014లో ఆయన కాంగ్రెస్‌లో ఉండి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజయ్‌ విజయం సాధించారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారు. 2018లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై విజయం సాధించారు. 
పువ్వాడ అజయ్ పై ఓడిపోయిన తర్వాత నామా నాగేశ్వరరావు టీడీపీకి గుడ్‌బై చెప్పేసి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తర్వాత ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు గతంలో సత్తుపల్ల నుంచి మూడుసార్లు గెలుపొందారు.అది రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఆయన ఖమ్మం నియోజకవర్గానికి షిప్ట్ అయ్యారు. మొదట విజయం సాధించారు. కానీ 2014లో ఓడిపోయారు. తర్వాత బీఆర్‌ఎస్‌లోకి మారి ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత పాలేరు ఉపఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో ఓడిపోవడంతో బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత తగ్గింది. 2023 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 


కొప్పుల ఈశ్వర్‌ ఓటమి
ధర్మపురిలో పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు గెలిచిన అడ్లూరి లక్ష్మణ్‌పై కొప్పుల ఈశ్వర్‌ అతి తక్కువ మార్జిన్‌ అంటే 441 ఓట్లతో విజయం సాధించారు. దీనిపై హైకోర్టులో కేసు కూడా వేశారు లక్ష్మణ్‌. 


శ్రీనివాస్ గౌడ్‌ హ్యాట్రిక్ మిస్


మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమిపాలయ్యారు. గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్ గౌడ్‌ ఉద్యమం టైంలో చురుగ్గా ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. 2014లో శ్రీనివాస గౌడ్‌ , బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డిపై మూడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 


అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి 
నిర్మల్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి విజయం సాధించి బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. గతంలో కూడా మహేశ్‌రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. నాలుగు సార్లు విజయం సాధిస్తూ వచ్చిన ఇంద్రకరణ్‌ రెడ్డి ఈసారి ఎదురు దెబ్బ తగిలింది. ఇంద్రకరణ్‌ రెడ్డి 2014లో బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో కారు గుర్తుపై విజయం సాధించారు.