Barrelakka News: కర్నె శిరీష... ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ బర్రెలక్క అంటే మాత్రం తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసి ఓ బజ్‌ క్రియేట్ చేసిన యువతి శిరీష. కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించారు. నిరుద్యోగ అజెండాతో బరిలో నిలిచిన శిరీష అనుకున్నట్టుగా ఓట్లు కొల్లగొట్టలేకపోయారు. 


ప్రచారం ఎక్కువ ప్రభావం తక్కువ 
బర్రెలక్కకు వచ్చిన బజ్‌ వేరే ఏ అభ్యర్థికీ రాలేదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. పోస్టల్ బ్యాలెట్‌లో కాస్త ప్రభావం చూపినట్టే కనిపించినా తర్వాత ఎక్కడా ఆమె ప్రభావం కనిపించలేదు. సోషల్ మీడియాలో ప్రచారం వచ్చింది కానీ స్థానికంగా ఆమెపై పెద్దగా జనం మొగ్గు చూపలేదని అర్థమవుతోంది. వేర్వేరు ప్రాంతాల్లోని కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. కానీ స్థానికులు మాత్రం ఆమెకు మద్దతు ఇచ్చినట్టు కనిపించలేదు. 


కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీషకు 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించగా... రెండో స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి నిలిచారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానంటూ ఆమె చేసిన ప్రచారానికి ప్రజలు పెద్దగా విలువ ఇవ్వలేదని తెలుస్తోంది. 


కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న జూపల్లికి 93609 ఓట్లు పోలు అయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి 63 వేల 678 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి అల్లేని సుధాకర్‌ కు 20 వేల ఓట్లు వచ్చాయి. ఐదు వేల ఓట్లు వచ్చిన శిరీషకు డిపాజిట్‌ కూడా దక్కలేదు.