Chhattisgarh Election Result:


ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా..


ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి అధికారంలో (Chhattisgarh Election Result 2023) రావాలన్న కాంగ్రెస్‌ లక్ష్యం గురి తప్పింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ఫలితాలే ఇక్కడా రిపీట్ అయ్యాయి. 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మెజార్టీ మార్క్ సాధించింది బీజేపీ. 54 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ వెనుకంజ వేసింది. 35 స్థానాలు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ చేతిలో ఉన్న రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌నీ తన ఖాతాలో వేసుకుంది కాషాయ పార్టీ. అలా రెండు రాష్ట్రాలకూ ఆ పార్టీని దూరం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చినప్పటికీ...ఫలితాలు అందుకు వైరుధ్యంగా వచ్చాయి. ముందు నుంచీ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ లీడ్‌లో దూసుకుపోయింది. ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌ని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేసింది బీజేపీ. మహాదేవ్ యాప్‌ స్కామ్, ఓబీసీ రిజర్వేషన్‌లు, అవినీతి ఆరోపణలు, ఆదివాసీల హక్కుల్ని పట్టించుకోకపోవడం లాంటి సమస్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టాయి. ఇవే బీజేపీని గెలిపించాయి. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైకమాండ్‌ భూపేశ్ భగేల్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. గత ఐదేళ్లలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు భగేల్. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన, సంచార్ క్రాంతి యోజన లాంటి పథకాలు అమల్లోకి వచ్చాయి.  కానీ..ఇవేవీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీని గెలిపించలేకపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయట పెట్టామని,నిజమేంటో తెలుసుకుని ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారని  బీజేపీ చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో 5 భారీ ర్యాలీలు నిర్వహించారు. మహాదేవ్ యాప్ స్కామ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఈ స్కామ్ వెలుగులోకి రావడం కాంగ్రెస్‌ని దెబ్బ తీసింది.