Telangana Congress Manifesto Released By AICC Chief Kharge: తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) విడుదలైంది. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో 'అభయ హస్తం' (Abhaya hastham) పేరుతో మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. 6 గ్యారెంటీలు సహా తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నూతన వ్యవసాయ విధానం, రైతు కమిషన్ ఏర్పాటు వంటి ప్రధాన హామీలుున్నాయి. 18 ఏళ్లు నిండి చదువుకునే ప్రతీ విద్యార్థిని ఓ ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పాత బకాయిలు చెల్లింపు వంటి హామీలు ప్రధానంగా ఉన్నాయి.
నెలకు రూ.25 వేల పెన్షన్
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేయనున్నట్లు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
మేనిఫెస్టోలో ప్రధాన అంశాలివే
- ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయంలో ప్రతి రోజూ 'ప్రజా దర్బార్' నిర్వహణ. ఎమ్మెల్యేలు ఆయాా నియోజక వర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహణ
- రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, భూమితో ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు. భూమి లేని ఉపాధి రైతుల కూలీలకు ఏడాదికి రూ.12 వేలు. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు. మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు.
- పంట బీమా MGNREGSలో వ్యవసాయ పనుల అనుసంధానం, పంట నష్టపోతే వెంటనే పరిహారం అందేలా పంట బీమా పథకం
- 'ధరణి' స్థానంలో భూమాత పోర్టల్ సరికొత్త రెవెన్యూ వ్యవస్థ, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు.
- రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు
- తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన యువతను అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్.
- ఉద్యమంలో పాల్గొన్న యువతపై కేసుల ఎత్తివేత, జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు
- తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, గౌరవభృతి అందజేత
- తొలి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాకలాగ్ ఉద్యోగాల భర్తీ
- ప్రతీ ఏటా జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి
- నిరుద్యోగ యువతకు ప్రతీ నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్ పీఎస్సీ పూర్తి ప్రక్షాళన, యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.
- ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ప్రభుత్వ రాయితీలు పొందే ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్లు
- విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా యూత్ కమిషన్, రూ.10 లక్షల వరకూ వడ్డీ లేని రుణ సదుపాయం.
- గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు, ఏజెంట్ల నియంత్రణ కోసం ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటు. మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, EWS వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు.
- ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్శిటీల ఏర్పాటు, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా 4 నూతన ట్రిపుల్ ఐటీల ఏర్పాటు.
- అమెరికాలో ఐఎంజీ అకాడమీ తరహాలోనే ప్రపంచ స్థాయి క్రీడా విశ్వ విద్యాలయం ఏర్పాటు
- పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ ల్లో 2 విద్యాలయాల ఏర్పాటు, 6 నుంచి పట్టభద్రులయ్యే వరకూ నాణ్యమైన విద్య అందించడం
- 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతీ విద్యార్థిని ఎలక్ట్రిక్ స్కూటీ అందజేత
- ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు, రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు
- అంబేడ్కర్ అభయ హస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం
- ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.6 లక్షలు అందజేత
- ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో అప్పగింత, అర్హులందరికీ పోడు భూముల పట్టాల పంపిణీ
- సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు
- ఎస్సీ కార్పోరేషన్లకు రూ.750 కోట్ల నిధులు మంజూరు, 3 ఎస్టీ కార్పోరేషన్లు ఏర్పాటు
- నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ల్లో 5 కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల స్థాపన
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష అందజేత. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే యువతకు రూ.5 లక్షలు అందజేత.
- ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, విదేశాల్లో యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయ అందజేత
- ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు కుల గణన, మైనార్టీలు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25 వేలు, పీజీ పాసైతే రూ.లక్ష. ఉర్దూ మీడియం పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ
- దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ.6 వేలు, అంగన్వాడీ టీచర్లకు నెల వేతనం రూ.18 వేలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం, 50 ఏళ్లు నిండిన జానపద కళాకారులకు నెలకు రూ.3 వేల పెన్షన్
- రేషన్ డీలర్స్ కు రూ.5 వేల గౌరవ వేతనం, మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5 లక్షల నగదు.
- మత బోధకులకు రూ.10 వేల - రూ.12 వేల గౌరవ వేతనం, వధువులకు రూ.1.6 లక్షల సాయం
- రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, కాళేశ్వరం ముంపు రైతులకు ఆర్థిక సాయం, రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని పంట రుణం, ప్రతి మండలానికి ఓ మార్కెట్ యార్డ్
- పాల ఉత్పత్తి దారులకు రూ.5 ప్రోత్సాహకం, ఇబ్బందికర ఫార్మాసిటీల రద్దు, 40 వేల చెరువుల నిర్వహణ, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత, ప్రతి జిల్లాలోనూ కోతుల సంతాన నియంత్రణ కేంద్రాల ఏర్పాటు.
ఓపీఎస్ అమలు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయడం సహా జీవో 317 ను సమీక్షించి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి. ఏటా ఉద్యోగ, ఉపాధ్యాయుల ట్రాన్స్ ఫర్స్, కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలల్లోపు అమలు వంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్కర్లకు వేతనం పెంచడం సహా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగులకు అన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందేలా హెల్త్ కార్డులు అందిస్తామని ప్రకటించింది.
నిరుద్యోగ యువత కోసం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీ ప్రకటించి, అన్నీ ఉపాధ్యాయ పోస్టులు 6 నెలల్లోపు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పింది. ఒక్కసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకుంటే అభ్యర్థులు ఆ ఏడాది మిగిలిన నోటిఫికేషన్లకు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నిరుద్యోగ యువతకు అవకాశం. పోటీ పరీక్షల కోసం తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు. రూ.1000 కోట్ల నిధితో రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని ప్రోత్సహిస్తామని తెలిపింది.
వైద్య రంగం
- అత్యవసర వైద్య సేవలకు 108, 104 అంబులెన్సుల ఆధునీకరించి విస్తరణ, ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.10 లక్షల వర్తింపు
- ఆర్ఎంపీ, పీఎంపీలకు 6 నెలల శిక్షణ ఇచ్చి 2009 యాక్ట్ అమలు. అన్ని ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించి నాణ్యమైన ఉచిత వైద్యం అందజేత
ఇతర హామీలు
- కల్యాణమస్తు పథకం కింద ఆడబిడ్డ వివాహానికి రూ.లక్ష, ఇందిరమ్మ కానుకగా తులం బంగారం
- మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీకే రుణాలు
- పుట్టిన ప్రతి ఆడ శిశువుకు ఆర్థిక సాయంతో కూడిన 'బంగారు తల్లి' పథకం పునరుద్ధరణ
- మహిళా పారిశ్రామిక వేత్తలకు శిక్షణ, రేషన్ కార్డులపై సన్నబియ్యం, ఉపాధి పని దినాలు 150కు పెంపు, కనీసం వేతనం రూ.350 అమలు.
- ప్రతి ఆటో డ్రైవర్ కు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.12 వేలు, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు, ప్రతి పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు
- పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం రాయితీ,
- ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి, వారికి 2 పీఆర్సీల బకాయిల చెల్లింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు కల్పన.
Also Read: Banks strike in December: సమ్మె బాటలో బ్యాంకులు, డిసెంబర్ ప్రారంభం నుంచే స్ట్రైక్ షురూ!