Telangana Elections 2023 :  కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ అప్పుల కుప్ప‌గా మారింద‌ని, దొర‌ల రాజ్యం పోయి ప్ర‌జ‌ల తెలంగాణ వస్తేనే బ‌తుకులు బాగుప‌తాయ‌ని ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ అన్నారు. బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. న‌రేంద్ర మోడీ నేస్తాలు కేసీఆర్‌, ఓవైసీ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదిలాబాద్‌లో ప‌ర్య‌టించారు. జిల్లా కేంద్రంలోని ఇందిర ప్రియ‌ద‌ర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా విజ‌య‌భేరి స‌భ‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు.  


తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంద‌ని ... తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలిస్తున్నార‌న్నారు. ప్రజలు కన్న కలలు, అమ‌రుల ఆశ‌యాలు నెరవేరట్లేద‌న్నారు. వందలాది మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణా ఏర్పడింద‌న్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చింద‌న్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్‌ పాలనలో అప్పుల కుప్పగా మారింద‌న్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు కేవలం హామీలు మాత్ర‌మే కావ‌ని.. ప్రభుత్వం ఏర్పాడ్డాక తొలి మంత్రిమండలి సమావేశంలోనే చట్టాలుగా మారుస్తామ‌ని తెలిపారు. 


మహిళలకు, రైతులకు ప్రాధాన్యత అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని రాహుల్ గాంధీ తెలిపారు.  ముఖ్యంగా మ‌హిళ‌లు లేకుండా సమాజాన్ని ఊహించలేమ‌న్నారు. ఇవాళ‌ 1200గా ఉన్న గ్యాస్ సిలెండర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పడగానే 500ల‌కే స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచిత‌మ‌న్నారు. వివాహ‌మైన మ‌హిళ‌ల‌కు నెల‌కు 2500లు వారి ఖాతాల్లో జ‌మ చేస్తామ‌న్నారు. వృద్ధులకు నాలుగు వేల పింఛ‌న్ ప్ర‌తినెల అందిస్తామ‌న్నారు. తెలంగాణాలో రైతు ఆత్మహత్యలను చూడటానికి మేము సిద్ధంగా లేమ‌ని, రైతులు భయంతో జీవించటం మేము ఇష్ట పడట్లేద‌ని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు అంద‌జేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. 


 తెలంగాణ కోసం అమరులైన ప్రతిఒక్క కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామ‌ని వెల్లడిచారు. అలాగే యువ వికాసం కింద, విద్యా భరోసా కింద 5 లక్షల సాయం అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. చేయూత కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు 4 వేలు ఇస్తామ‌న్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స ఖర్చులు చెల్లిస్తామ‌న్నారు. కాంగ్రెస్‌ సర్కార్ ఏర్పడ్డనాటి నుండి దొరల తెలంగాణ పోయి ప్ర‌జ‌ల‌ తెలంగాణగా మారనుంద‌న్నారు. ప్ర‌జల వద్ద నుండి కేసీఆర్ లూటీ చేసిన ధ‌నాన్ని క‌క్కించి సంక్షేమం రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరుస్తామ‌న్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎంలు ఒక్క‌టేన‌ని ఆరోపించారు. 


కొన్ని నెల‌ల కింద‌టి వ‌ర‌కు బీజేపీలో గాలిలో ఎగిరంద‌ని, నాలుగు నెల‌ల్లోనే కాంగ్రెస్ వారి గాలి తీసేసింద‌న్నారు. మోడీ మరో మితృడు ఓవైసీ అన్నారు. అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర ఇలా ఎక్కడైనా బీజేపీతో కాంగ్రెస్‌ కలబడితే అక్కడ ఎంఐఎం అడ్డొస్తుంద‌న్నారు. ఇక్కడ పోటీ కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంద‌ని, బీఆర్ఎస్‌కు వారి మిత్రులు తెరవెనుక సహకరిస్తార‌న్నారు. తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్‌ సర్కార్ ఏర్పడ‌బోతోంద‌ని, నఫ్రత్ కి బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలెంగే అని చివరిలో నినాదం ఇచ్చారు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply