Telangana Elections 2023 Modi Tour :  హైదరాబాద్  :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో సారి తెలంగాణ పర్యటనకు రానున్నారు.   నవంబర్‌ 7 న ఆయన  ఎల్బీ స్టేడియంలో బీజేపీ ( BJP ) బీసీ‌ గర్జన సభకు హాజరైన మోదీ.. మరోసారి శనివారం హైదరాబాద్ ( Hyderabad ) వస్తున్నారు.  శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ మాదిగ విశ్వరూప సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ వేదిక నుంచి ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేటలో ప్రధాని మోదీ దిగుతారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్‌ గ్రౌండ్‌కు ( Parede Ground ) చేరుకుంటారు. సుమారు గంటపాటు ఈ సభ జరగనుంది. సభ జరిగిన వెంటనే తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.  
 
11న పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప సభను విజయ వంతం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. మంద కృష్ణ మాదిగ  నేతృత్వంలోనే సభ నిర్వహిస్తున్నారు.  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలనే డిమాండ్‌తో ఏర్పాటు చేసే ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్టు  మందకృష్ణ చెబుతున్నారు.  


మోదీ పర్యటన బీజేపీలో ఓ వర్గం నేతల్ని ఇబ్బందిపెడుతోంది.  ఎస్సీ వర్గీకరణ విషయంలో మోదీ కీలక నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం ఉండటంతో  ఈ సభకు బీజేపీ ఎస్సీ మోర్చా దూరంగా ఉండాలని భావిస్తోంది. బీజేపీ దళిత నేతల్లోని ఎస్సీ మాల వర్గం ఈ సభకు దూరం కాబోతోంది. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ సామాజిక వర్గం చాన్నాళ్లుగా పోరాటం చేస్తోంది. కానీ మాల సామాజిక వర్గానికి ఈ వర్గీకరణ ఇష్టం లేదు. గతంలో ఏపీ ప్రభుత్వం వర్గీకరణ కోసం ఇచ్చిన జీవోలను మాల మహానాడు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడితో ఆ వర్గీకరణ నిర్ణయం ఆగిపోయింది. బంతి కేంద్రం కోర్టులో పడింది. 


కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమయ్యే అవకాశముంది. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా.. కీలక రాజ్యాంగ సవరణకు ప్రధాని మోదీ ఆమోదం తెలుపుతారని అంటున్నారు. అంటే అది మాదిగలకు అనుకూల నిర్ణయం, అదే సమయంలో మాల సామాజిక వర్గానికి అది ఇష్టం లేదు. అందుకే వారు పార్టీలో ఉన్నా కూడా ప్రధాని మోదీ సభకు హాజరయ్యేందుకు జంకుతున్నారు. మాదిగల ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్ కి హాజరైతే.. మాల సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతుందని అందుకే తాము దూరంగా ఉంటామంటున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో దళిత నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వంటి వారు పార్టీ మారారు.  అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని  అంటున్నారు. 


అయితే ఇది పార్టీ సమావేశం కాదని మాదిగవిశ్వరూప సభ కాబట్టి.. బీజేపీ నేతలు హాజరవుతారా లేదా అన్నది కీలకంకాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.