తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం 6:49 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆదివారం సాయంత్రం రామగుండం, జగిత్యాల జిల్లాలలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాయంత్రం 6:49 నిమిషాలకు దాదాపు 3 సెకన్లు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో వస్తువులు కింద పడ్డాయి. భూకంప తీవ్రత స్వలంగా ఉండడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
మూడు సెకన్ల పాటు భూకంపం
పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడంతో జనం పరుగులు తీశారు. ఆదివారం రాత్రి ఆరు గంటల 49 నిమిషాల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపిచడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు తీశారు. పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట, ముత్తారం మండలంలోని హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్ గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ అశోక్ నగర్ గాంధీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షెటిపేట, బెల్లంపల్లి, మందమర్రి, అసిఫాబాద్, వేమనపల్లి, బెజ్జూరు ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు భూమి కంపించింది.
Also Read: సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు.. ఎందుకంటే.. ఆ వీడియోలపై సీపీ వివరణ
గత వారంలో కూడా
గతవారం కూడా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు రెండు సెకన్ల భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4గా నమోదైంది. అప్పుడు కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. తరచూ గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో భూమి కంపించడంతో పరిసర గ్రామాలు, పట్టణాల ప్రజలు భయందోళన చెందుతున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు