Telangana Director of Health Gadala Srinivasa Rao : రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ వివిధ శాఖలలోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తోంది. ఇప్పటికే పలవురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గడల శ్రీనివాసరావు.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సుదీర్ఘ కాలంగా అదే పోస్టులో ఉన్నారు. కరోనా సమయంలోనూ ఆయనే కీలకంగా విధులు నిర్వర్తించారు. అయితే ఆయనకు రాజకీయ నేతగా మారాలన్న కోరిక ఎక్కువ. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన వీర విధేయత ప్రకటించేవారు. ఓ సారి కాళ్లకు నమస్కారం చేశారు. ఆయన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంచుకుని తరచూ అక్కడ పర్యటించేవారు.
కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం కోసం గడల శ్రీనివాసరావు చివరి వరకూ ప్రయత్నించారు. కొత్తగూడెంలో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొత్తగూడెంలో కార్యక్రమాలు పెట్టినప్పుడల్లా ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూ ఉండేవారు. గతంలో ఓ ఐఎఎస్ అధికారి కేసీఆర్ కి వీరవిధేయుడిగా మారి, ఆయన కాళ్లకు నమస్కరించారు. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయిపోయారు. ఇదే తరహాలో శ్రీనివాసరావు కూడా ప్రయత్నించారు.
కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ గులాబీ అధినేత టికెట్ నిరాకరించడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో అతడి వైఖరిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ అతడికి స్థాన చలనం కల్పించింది. ఆయన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరుతారో లేకపోతే ప్రభు్తవం ఇచ్చిన పోస్టింగ్ లో ఉంటారో చూడాల్సి ఉంది.