DH Srinivas :  తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు సెమీ క్రిస్మస్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంఅవుతున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో డీఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ సందర్భంాగా ఆయన  యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.., మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ వ్యాఖ్యానించారు.  ఆధునిక సంస్కృతి కానీ.. మన దేశానికి కానీ.. మన రాష్ట్రానికి కానీ..అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులని ఆయన అన్నారు   ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు.  లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేదన్నారు. 


క్రైస్తవం లేకపోతే ప్రపంచంలో భారత దేశం ఇంత అభివృద్ది చెంది ఉండేది కాదని గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఆ రోజు ఎవరైతే ఆధునిక విద్యను, ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో. వారి వల్లే మనం అభివృద్ధి చెందాం. మన దేశాన్ని అన్ని దేశాల కంటే ముందుండేలా చేసిందన్నారు.  యేసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలని పిలుపునిచ్చారు.  ఇంతకు ముందు జరుపుకున్న క్రిస్మస్‌లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌లు వేరని..   గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి ప్రశ్నార్థకంగా కొవిడ్ మారిందన్నారు.  దాన్నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యామన్నారు.  అది మనం చేసిన సేవల వల్ల కాదు. యేసు క్రీస్తు కృప, యేసు క్రీస్తు దైవం యెుక్క దయ ప్రభావం అని స్పష్టం చేశారు. 


డైరక్టర్ ఆఫ్ హెల్త్ గా.. సుదీర్ఘ కాలం నుంచి  పని చేస్తున్న గడల శ్రీనివాసరావు..  తెలంగాణలో మూడు వేవ్ ల సమయంలో కరోనాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు ఆయన నేతృత్వంలోనే పోరాడారు. అయితే ఇప్పుడు ఆయనకే మనమేం సేవలు చేయలేదని అంతా ఏస్తుక్రీస్తు చలువేనని చెప్పడం వివాదాస్పదం అవుతోంది. ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం ఆయనకు ఇదే మొదటి సారి కాదు. గతంలో కొత్తగూడెం జిల్లా జిమ్నా తండాలో  సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి వింత పూజలు చేశారు. అగ్నిగుండంలో నిమ్మకాయలు, ఎండు మిర్చి వేసి ఎంపీపీ చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేశారు.  


బీఆర్ఎస్ తరపున  ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. అందుకే కొత్తగూడెం ప్రాంతంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్.. సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   ప్రగతిభవన్ నుంచి వర్చువల్ ద్వారా మెడికల్ కాలేజీలను కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఆయన కాళ్లు మొక్కారు.  సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఒక్కసారి కాదు వందసార్లైనా కాళ్లు మెుక్కుతానని ప్రకటించారు. రాజకీయ లబ్ది కోసమే ఇలా ప్రకటనలు చేస్తున్నారని ఆయనపై విమర్శలు సహజంగానే వస్తున్నాయి.