Two Wheeler Insurance: మీకు ద్విచక్ర వాహనం ఉంటే, ఈ వార్త కచ్చితంగా మీ కోసమే. మీ బైక్‌ లేదా స్కూటర్‌కు మంచి బీమా పాలసీ తప్పనిసరి. దురదృష్టవశాత్తు మీ వాహనానికి ఏదైనా జరిగితే, ఆ బీమా మిమ్మల్ని ఆర్థిక నష్టం నుంచి కాపాడుతుంది. రోడ్డు ప్రమాదాల సమయంలో ఆర్థిక పరిహారంతో పాటు, మోటారు వాహన చట్టం ప్రయోజనాలను అందిస్తుంది.


బైక్ లేదా స్కూటర్‌ కొనే సమయంలో, లేదా రెన్యువల్‌ చేసుకునే సమయంలో మంచి కంపెనీ నుంచి ఉత్తమ వాహన బీమా తీసుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేక ఫస్ట్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలా అని కొంతమంది తర్జనబర్జన పడుతుంటారు. మీ అవసరాన్ని బట్టి, ద్విచక్ర వాహనాలకు ఎలాంటి బీమా తీసుకోవాలి అన్న విషయం మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి.


కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్ పాలసీ
థర్డ్ పార్టీ బీమా అనేది ఒక రకమైన ప్రధాన బీమా పాలసీ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే, ముందే ఈ పాలసీని కొనుగోలు చేయడం మంచి పని. మరోవైపు.. స్టాండలోన్ ఓడీ పాలసీ (standalone OD policy) నష్టాలను కవర్ చేస్తుంది. ఈ రెండిటి (స్టాండలోన్ పాలసీ + థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్) కలయికే సమగ్ర బీమా పాలసీ (comprehensive insurance policy).


ఫస్ట్‌ పార్టీ ఇన్సూరెనస్‌ (First-party Insurance)
ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో, ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వాహనం దొంగతనం, ఏదైనా విపత్తు, లేదా ప్రమాదం జరిగినప్పుడు పూర్తి బీమా రక్షణను ఇది అందిస్తుంది. మీకు కలిగే ఆర్థిక నష్టాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.


థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ (Third-party Insurance)
ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్‌ కంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను చౌకగా కొనవచ్చు. ఇది, థర్డ్‌ పార్టీ నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. వాహనానికి జరిగే పూర్తి నష్టాన్ని కవర్ చేయదు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ప్రతి వాహన యజమాని కనీసం థర్డ్ పార్టీ బీమాను కలిగి ఉండాలి. బీమా పాలసీ తీసుకోవడం మీ ఇష్టం అయినప్పటికీ, థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి.


జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్
బైక్‌ లేదా స్కూటర్‌ రోజువారీ ఉపయోగం వల్ల దాని పనితీరు తగ్గుతుంది. కాలక్రమేణా ఆ వాహనం విలువ కూడా తగ్గుతుంది. ఇలాంటి తరుగుదలను కవర్‌ చేయడానికి ప్రాథమిక బీమా పాలసీ కాకుండా, యాడ్ ఆన్ 'జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్' (Zero Depreciation Bike Insurance) తీసుకోవడం ఉత్తమం. ఇది, మీ బైక్‌లోని బ్యాటరీ, ట్యూబ్‌లు, టైర్లు మినహా మిగిలిన విడిభాగాలు అన్నింటికీ 100 శాతం నష్ట కవరేజ్‌ ఇస్తుంది. వాహనం బ్యాటరీ, ట్యూబ్‌లు, టైర్లు పాడైపోయినప్పుడు 50 శాతం కవరేజ్‌ ఇస్తుంది.


అపరిమిత కవరేజీ
బైక్‌ల విషయానికి వస్తే, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను స్టాండ్ ఎలోన్ పాలసీతో కలిసి ఎంచుకోవచ్చు. చాలా బీమా కంపెనీలు ఒక టర్మ్‌లో గరిష్టంగా 2 'జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ కవరేజ్‌'లను అనుమతిస్తాయి. మరికొన్ని బీమా కంపెనీలు టర్మ్ సమయంలో అపరిమిత కవరేజ్‌ను అనుమతిస్తాయి.


మరో విషయం, ఒకవేళ మీరు బైక్ ప్రమాదాన్ని క్లెయిమ్ చేసుకుని ఉంటే, అది కొత్త బైక్ బీమా ప్రీమియం మీద ప్రభావం చూపుతుంది. అలాంటి సందర్భాల్లో బీమా కంపెనీ మీ బైక్‌కు ఎక్కువ బీమా ప్రీమియం (కొత్త పాలసీ మీద) వసూలు చేస్తుంది.