Multibagger IPOs 2022: ఈ సంవత్సరం (2022) దలాల్ స్ట్రీట్‌లో కనిపించిన అస్థిరత ప్రభావం ప్రైమరీ మార్కెట్‌ మీద ఎక్కువ ప్రభావం చూపలేదు. 2022లో అరంగేట్రం చేసిన IPOల పనితీరు చాలా వరకు సానుకూలంగా ఉంది. 


ఈ సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ 12 వరకు, 32 కంపెనీలు తమ IPOల ద్వారా సుమారు రూ. 50,305 కోట్లను సేకరించాయి. సగటున 12% లిస్టింగ్ గెయిన్స్‌ మాత్రం అందించాయి. 


ఈ వార్తలో, ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాం. కాబట్టి, సూల వైన్‌యార్డ్స్‌, అబాన్స్ హోల్డింగ్స్, ల్యాండ్‌మార్క్ కార్స్‌, కేఫిన్‌ టెక్నాలజీస్, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఇష్యూలను లెక్కలోకి తీసుకోలేదు.


గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్‌గా ఉన్న ప్రస్తుత పతంజలి ఫుడ్స్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) కూడా ఈ వార్తలో ఉంది. పెట్టుబడిదారుల నుంచి ఈ కంపెనీ రూ. 4,300 కోట్లు సేకరించింది.


2022లో దాదాపు మూడు వంతుల ఇష్యూలు సానుకూల లిస్టింగ్ గెయిన్స్‌ అందించాయి. దాదాపు అదే సంఖ్యలో స్టాక్స్‌ లిస్టింగ్ ప్రైస్‌ కంటే పైన ట్రేడవుతున్నాయి. ఇదొక డీసెంట్ పెర్ఫార్మెన్స్.


అరంగేట్రం చేసిన కంపెనీల్లో 75% లేదా, 32 IPOల్లో 24 పాజిటివ్‌ నోట్‌లో లిస్ట్‌ అయ్యాయి. 14 కంపెనీలు అరంగేట్రంలోనే 10-55% లాభపడ్డాయి. మిగిలిన 8 కంపెనీలు 9% వరకు తేలికపాటి డిస్కౌంట్‌తో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాయి.


లిస్టింగ్‌ డే నాడు... ఎలక్ట్రానిక్స్ మార్ట్, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ 50% కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి. ఆ తర్వాత హర్ష ఇంజనీర్స్, DCX సిస్టమ్స్, హరిఓం పైప్స్ ఉన్నాయి. LIC, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ పెట్టుబడిదారులను అత్యంత ఎక్కువగా నిరాశపరిచాయి.


2022లో అతి పెద్ద, అతి చిన్న IPOలు
2022 సంవత్సరంలో LIC అతి పెద్ద ఇష్యూగా రికార్డ్‌ క్రియేట్‌ చేసంది. ఇది ప్రైమరీ మార్కెట్ల నుంచి దాదాపు రూ. 21,000 కోట్లు రాబట్టింది. అదే సమయంలో... హరిఓం పైప్స్, వీనస్ పైప్స్ ఇష్యూల్లో అతి చిన్నవి. ఇవి వరుసగా రూ. 130 కోట్లు, రూ. 165 కోట్లు సేకరించాయి.


2022లో లిస్టింగ్‌ సమయం నుంచి డిసెంబర్ 19 వరకు 32 కంపెనీల్లో 25 సానుకూల రాబడిని అందించాయి. 7 కంపెనీలు 50% పైగా లాభపడ్డాయి. అయితే, అదే సంఖ్యలో కంపెనీలు నెగెటివ్‌ రిటర్న్స్‌ అందించాయి.


2022లో మల్టీబ్యాగర్‌ IPOలు
అదానీ విల్మార్, వీనస్ పైప్స్, హరిఓం పైప్స్‌, వెరాండా లెర్నింగ్ మల్టీ బ్యాగర్లుగా మారి, పెట్టుబడిదారులకు వరాలు ఇచ్చాయి. ఇవి, వాటి లిస్టింగ్ నుంచి 106-177% వరకు పెరిగాయి. పతంజలి ఫుడ్స్, ప్రుడెంట్ కార్పొరేట్, వేదాంత్‌ ఫ్యాషన్స్‌ 50% లేదా అంతకంటే ఎక్కువ లాభపడ్డాయి.


2022లో పరమ చెత్త IPOలు
2022లో మొదటి ఇష్యూగా వచ్చిన AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, ఈ ఏడాదిలో అత్యంత అధ్వాన్నంగా మారిన IPOగా ఉద్భవించింది. లిస్టింగ్‌ ధర నుంచి 60% పడిపోయింది. LIC కూడా ఇష్యూ ధర నుంచి 27% తగ్గి, పరమ చెత్త IPOల్లో రెండో స్థానంలో ఉంది.


డెలివెరీ, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, కీస్టోన్ రియల్టర్స్, ధర్మజ్ క్రాప్ గార్డ్, యూనిపార్ట్స్ ఇండియా సహా ఇతర కంపెనీలు వాటి ఇష్యూ ధరల నుంచి 1-18% తగ్గాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.