SEBI On Share Buyback: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (Securities and Exchange Board of India - SEBI), స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా సొంత షేర్లను కంపెనీలు తిరిగి కొనుగోలు చేసే (షేర్‌ బై బ్యాక్‌) పద్ధతిని దశల వారీగా రద్దు చేయాలని నిర్ణయించింది. మంగళవారం (20 డిసెంబర్‌ 2022) జరిగిన సెబీ బోర్డు సమావేశంలో... స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా బై బ్యాక్‌ల రద్దు సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.


ప్రస్తుతం, స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి షేర్ బై బ్యాక్ చేస్తున్న పద్ధతిలో ఆశ్రిత పక్షపాతానికి, అనుచిత ప్రాధాన్యానికి అవకాశం ఉంది కాబట్టి, 2025 ఏప్రిల్‌ నుంచి దశల వారీగా తగ్గిస్తూ, పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు SEBI చైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్ తెలిపారు. టెండర్ మార్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బై బ్యాక్‌ నిబంధనలకు సంబంధించి,  HDFC వైస్ చైర్మన్ & CEA కెకీ మిస్త్రీ కమిటీ తన రిపోర్టులో చేసిన సిఫారసుల ఆధారంగా సెబీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 


ప్రస్తుతం 2 బై బ్యాక్‌ పద్ధతులు
ప్రస్తుతం, కంపెనీలు రెండు పద్ధతుల్లో సొంత షేర్లను బై బ్యాక్‌ చేస్తున్నాయి. ఒకటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రూట్‌ (ఓపెన్‌ మార్కెట్‌). రెండోది టెండర్‌ రూట్‌. 


స్టాక్‌ ఎక్స్ఛేంజీ రూట్‌లో, స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో ఉన్న సెల్లర్స్‌ నుంచి షేర్లను కంపెనీలు తిరిగి కొనుగోలు చేస్తాయి. ఇది ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ. ఈ పద్ధతిలో కంపెనీలు తమకు నచ్చిన వాళ్ల దగ్గరి నుంచి షేర్లను కొనవచ్చు. ఆశ్రిత పక్షపాతం చూపడానికి ఇక్కడ అవకాశం ఉంది. పైగా, ఇన్వెస్టర్‌ తన షేర్లను అమ్మినప్పుడు.. ఓపెన్‌ మార్కెట్‌ రూట్‌లో వాటిని కంపెనీయే కొన్నదా, లేదా వేరే ఇన్వెస్టర్‌ కొన్నారా అన్నది కూడా తెలీదు. ఈ పద్ధతిలో, చిన్న మదుపరులకు (రిటైల్‌ ఇన్వెస్టర్లు) దాదాపుగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. 


చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం
టెండర్‌ పద్ధతిలో ఇలా జరగదు. కంపెనీలు షేర్‌ బై బ్యాక్‌ కోసం కొంత ధరను (ఆఫర్‌ ప్రైస్‌) ప్రకటిస్తాయి. ఈ పద్ధతిలో, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి బడా మదుపర్ల వరకు తమ షేర్లను విక్రయించడానికి టెండర్‌ వేయొచ్చు. కంపెనీకి వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా, షేర్ల కొనుగోలు రేషియోను (బై బ్యాక్‌ రేషియో) కంపెనీ ప్రకటిస్తుంది. టెండర్‌ వేసిన ప్రతి ఇన్వెస్టర్‌ దగ్గరి నుంచి ఆ రేషియో ప్రకారం, ముందుగా ప్రకటించిన ధర చెల్లించి షేర్లను కొంటుంది. ఇక్కడ జరిగే ప్రతి స్టెప్‌ బహిరంగమే కాబట్టి, అనుచిత లబ్ధి పొందడానికి ఎవరికీ అవకాశం ఉండదు. కాబట్టి, చిన్న ఇన్వెస్టర్లు కూడా ఈ పద్ధతిలో సమాన ప్రయోజనం పొందుతారు.


ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్ల బై బ్యాక్‌కు అనుమతి ఉన్నంత కాలం, బై బ్యాక్ చేపట్టేందుకు ఎక్స్ఛేంజ్‌లో స్పెషల్‌ విండో ప్రారంభించనున్నట్లు సెబీ తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారానే కంపెనీలు షేర్ల బై బ్యాక్‌ చేపట్టాలి. స్టాక్ మార్కెట్ నుంచి బై బ్యాక్ ద్వారా సేకరించిన మొత్తంలో 75 శాతాన్ని కంపెనీలు వినియోగించుకోవాలని బోర్డు సమావేశంలో సెబీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 50 శాతంగా ఉంది. 


ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న బై బ్యాక్‌ సమయాన్ని 2023 ఏప్రిల్ 1 నుంచి 66 రోజులకు (18 రోజులు తగ్గింపు), 2024 ఏప్రిల్‌ 1 నుంచి 22 రోజులకు సెబీ తగ్గించింది.