తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు హైదరాబాద్‌లో జరగనుంది. ఎల్బీస్టేడియం వేదికగా జరిగే విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రముఖులు ఆ ప్రాంతంలో సుమారు ఐదారు గంటలు ఉంటారు కాబట్టి.. ఆ పరిసరాల్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ ప్రాంతమంతా పోలీసుల నిఘా నీడలో ఉండనుంది.
క్రిస్మస్ విందు సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం రెండు గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి, చాపల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ రూట్‌లో నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్‌ను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి చాపల్‌రోడ్డు, స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు రూట్‌లో వచ్చే వాహనాలను కింగ్ కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డులోకి పంపిస్తారు. సుజాత స్కూల్ లైన్ నుంచి ఖాన్ లతీఫ్‌ఖాన్ బిల్డింగ్ వైపు రోడ్డును పూర్తిగాా మూసివేయనున్నారు. ఈ రూట్‌లో వాహనాలను అనుమతించడం లేదు. ఇలా వచ్చే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు కారణంగా పోలీస్ కంట్రోల్ రూం, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి, కేఎల్‌కే బిల్డింగ్, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకపూల్, ఇక్బాల్ మినార్, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్, హైదర్‌గూడ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ రూట్‌లను పూర్తిగా తప్పించి వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిచంచారు. ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి నుంచి అబిడ్స్ వైపు కాకుండా ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు.