సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవ‌ల్లిలో కిసాన్ కాంగ్రెస్ చేపట్టిన  ర‌చ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవ‌డం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డిని పోలీసులు బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకోవ‌డం రాజ్యాంగ హ‌క్కుల‌ను కాలరాయడమే అని ఆరోపించారు. ర‌చ్చబండ కార్యక్రమానికి వెళుతున్న సీనియ‌ర్ నాయ‌కులు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, మాజీ మంత్రి మంథ‌ని, ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు, కాంగ్రెస్ నాయ‌కుల‌ను, కార్యక‌ర్తలను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చ‌ర్యల‌ను తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రతిప‌క్షపార్టీల‌కు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రక‌ట‌న స్వేచ్ఛ, నిర‌స‌న తెలిపే హ‌క్కుల‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల‌రాస్తుందని ఆరోపించారు. 




Also Read: తీవ్ర తోపులాటల మధ్య రేవంత్ రెడ్డి అరెస్టు.. చిరిగిన మల్లు రవి చొక్కా, పీఎస్‌కు తరలింపు


రైతులకు అండగా కాంగ్రెస్ 


సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల‌పై ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ పోరాట‌యోధులు, క‌వులు, క‌ళాకారులు, మేధావులు త‌ప్పక స్పందించాలని మధు యాష్కీ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర‌స‌న‌లను పోలీసులు ఇనుప‌కంచెలు ఆప‌లేవన్నారు. ఉక్కు పాదాల‌ కింద భావ‌వ్యక్తీక‌ర‌ణ‌ను ఆపే ప్రయ‌త్నం చేస్తే కాంగ్రెస్ శ్రేణులు అంతే ధాటిగా స్పందిస్తాయన్నారు. చ‌రిత్రలో వ‌రి వేయ‌వ‌ద్దని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రే వారికి వ‌రి వేస్తే ఉరేన‌ని చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండ‌గా ఉంటుందన్న ఆయన.. రైతుల కోసం పోరాటాల‌ు, ఉద్యమాలు చేసేందుకు యావ‌త్ కాంగ్రెస్ నాయ‌క‌త్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులెవ‌రూ అధైర్య పడాల్సిన ప‌నిలేదన్నారు. ప్రభుత్వం వ‌రి ధాన్యాన్ని కొనేవ‌ర‌కూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 


Also Read:  రేవంత్ హౌస్ అరెస్టు.. అన్ని దారులు మూసేసిన పోలీసులు.. ‘కేసీఆర్‌కి ఎందుకీ భయం’ అంటూ ట్వీట్


కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టు


గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట సాగుచేశారని, దానిని మీడియాకు చూపిస్తానని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రచ్చబండకు వెళ్లేందుకు రేవంత్ ఇంటి నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేశారు. 


Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి