తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల పోలీసులు చుట్టుముట్టారు. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదంటూ రేవంత్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రేవంత్ ఇంటికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అర్ధరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసుల పహారా కాస్తున్నారు.
జీవన్ రెడ్డి కూడా..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈయన కూడా ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. 150 ఎకరాల్లో సీఎం కేసీఆర్ ఎలా వరి సాగు చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఒక నీతి.. రైతులకు ఇంకో నీతా అని జీవన్ రెడ్డి నిలదీశారు.
ప్రభుత్వానికి భయమా? ఎందుకీ భయం?
మరోవైపు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు ఉంచడంపై తెలంగాణ కాంగ్రెస్ సహా రేవంత్ ట్వీట్లు చేశారు. తన ఇంటి ఎదుట ఉన్న పోలీసులకు సంబంధించి ఫోటోలను ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ పోలీసులకు స్వాగతం. నా ఇంటికి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసేశారు. అసలు ప్రభుత్వానికి ఎందుకు భయం? దేనికి భయం?’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. సీఎం కేసిఆర్ నియోజీకవర్గం, గజ్వేల్ లో ఈ రోజు రైతులతో రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఎందుకంత భయం కేసీఆర్? రైతులు నీ గురించి నిజం చెప్తారనా?’’ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
Also Read: PM Modi Mann ki Baat: మోదీ నోట తెలంగాణ వ్యక్తి పేరు.. మన్ కీ బాత్‌లో ప్రత్యేక ఆకర్షణ, ఎందుకో తెలుసా?
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా