తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీగా వచ్చి ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ లాఠీఛార్జ్ లో హుజూరాబాద్ అభ్యర్థి, NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తీవ్ర గాయలై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. 








లాఠీచార్జ్ లో గాయపడిన వారిని పరామర్శించిన మధుయాష్కీ


కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'విద్యార్ధి నిరుద్యోగ జంగ్ సైరన్' లో పాల్గొన్న విద్యార్థి నాయకులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా లాఠీచార్జ్ లో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఇలాంటి నిరంకుశ పాలన ఇప్పటి వరకు చూడలేదని, తెలంగాణ అమర వీరులను స్మరించుకునే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదా అని మధుయాష్కీ గౌడ్ ఆవేదన చెందారు. ఉద్యోగాలు అడిగితే ఇంత దుర్మార్గంగా దాడులు చేస్తారా ? అని ప్రశ్నించారు. దీనికి వెంటనే  ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, రానున్న కాలం కాంగ్రెస్ దే అని విద్యార్థి నాయకులకు ధైర్యం చెప్పారు. లాఠీచార్జ్ లతో, తుపాకులతో ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే భవిష్యత్ లో ఉద్ధృతంగా ఉద్యమాలు జరుగుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 






హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: వెంకట్


హుజూరాబాద్‌ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి బల్మూరి వెంకట్‌ నర్సింగ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ లో పాల్గొన్న వెంకట్‌ పోలీసుల తోపులాటలో స్పృహ కోల్పోయి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తాను మరోసారి 2018లో రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావడంలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ వల్లే మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనలాంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగానన్నారు. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని వెంకట్ అన్నారు. హుజూరాబాద్‌ పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వెంకట్ ధీమా వ్యక్తం చేశారు.


Also Read: ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్.. రేవంత్ రెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు... కేసీఆర్, కేటీఆర్ అనుమతి కావాలా అని రేవంత్ రెడ్డి ఆగ్రహం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి