CM Revanth Reddy Key Announcement On Digital Health Cards: తెలంగాణలో డిజిటల్ హెల్త్ కార్డులపై (Digital Health Cards) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ గురువారం ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య అందించాల్సి ఉందని అన్నారు. ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని.. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.






రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉందని.. ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తారని సీఎం రేవంత్ వివరించారు. 'పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయం. క్యాన్సర్ మహమ్మారితో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆస్పత్రి యాజమాన్యం మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను  అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.' అని పేర్కొన్నారు.


వారికి నియామక పత్రాలు


అనంతరం, తెలంగాణ నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో అనే దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉదాహరణ అని అన్నారు. పై అధికారులు చెప్పారని.. నాణ్యత, నిబద్ధత విషయంలో ఎప్పుడూ రాజీపడొద్దని.. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని అన్నారు. 'నాణ్యతగా లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టుల వల్ల లక్షల ఎకరాలకు నీరు, విద్యుత్ అందుతుంది. కానీ, ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే కూలిపోయింది. నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా అధ్యయనం చేయాలి. ఈ ప్రాజెక్టును గత పాలకులు ప్రపంచ అద్భుతంగా వర్ణించారు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సమర్థంగా పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిర్మాణ సామగ్రి నాణ్యతగా లేదని ఇంజినీర్లు వెనక్కు పంపి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఓ దేశం గొప్పతనాన్ని చెప్పేది ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడాలే.' అని సీఎం పేర్కొన్నారు.


Also Read: KTR : అమ్మమ్మ ఊరి పిల్లలకు కేటీఆర్ బడి గిఫ్ట్ - సొంత డబ్బుతో కొత్త బిల్డింగ్ !