Jagan Tirumala tour is likely to be controversial : పాప ప్రక్షాళన అంటూ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు జగన్ వెళ్లాలని నిర్ణయించారు. ఇరవై ఏడో  తేదీన సాయంత్రమే ఆయన తిరుమలకు చేరుకుని ఇరవై ఎనిమిదో తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే జగన్ డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని  బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తామని బీజేపీ నేతలు, హిందూ సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుమల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత అనుచరులతో కలిసి స్వామి వారి భజన చేసుకుంటూ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి వెళ్లారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపానికి అందరూ స్వామికి వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేని.. తనతో పాటు రావాలని పిలుపునిచ్చారు. మరో వైపు తిరుపతి  బీజేపీ నేతలు జగన్ డిక్లరేషన్ ఇస్తేనే కొండపైకి రానివ్వాలని  టీటీడీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. 



కొద్ది రోజుల కిందట తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్దు బీజేవైఎం నేతలు హడావుడి చేశారు. జగన్ ఇంటిపైకి కాషాయ రంగు చల్లారు. జగన్ ఆ సమయంలో ఇంట్లో లేరు . బెంగళూరులో ఉన్నారు. లడ్డూ కల్తీ వివాదంలో జగన్ పై హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి వారి దర్శనానికి వెళ్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. హిందూ సంఘాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తిరమలకు చేరుకుంటున్నారు.  



డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమలకు రావాలని  జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.  డిక్లరేషన్ లేకుండా వస్తే స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని ప్రకటించారు.  తిరుపతిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఇప్పటికే ఆరోపించారు. జగన్ తిరుమలకు వస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 


జగన్ తిరుమల పర్యటనకు వైసీపీ నేతలు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆయన దర్శనం కోసం ముందుగా టిక్కెట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. నడక మార్దం ద్వారా తిరుమకు జగన్ వెళ్తారని ప్రచారం జరుగుతోంది కానీ.. వైసీపీ వర్గాలు ధృవీకరించడం లేదు. ఇరవై ఏడో తేదీన ఆయన ఏ సమయంలో తిరుమల చేరుకుంటారు.. ఇరవై ఎనిమిదో తేదీన ఏ సేవలో పాల్గొంటారు... అన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే జగన్ పై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న కారణంగా డిక్లరేషన్ ఇస్తేనే.. తిరుమలకు రావాలని లేకపోతే.. దర్శనానికి అనుమతించబోమని టీడీపీ వర్గాలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.