Revanth Reddy News Today: హైదరాబాద్: రెండు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నూతన సీఎల్పీ నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. నూతన సీఎల్పీ నేతగా తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
నూతన సీఎల్పీ నేతగా తనను ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకు.. పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
డిసెంబర్ 7న రేవంత్ ప్రమాణ స్వీకారం..
డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి హాజరుకావాలని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, ఠాక్రే, శివకుమార్ లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించేందుకు తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి ప్రయాణమయ్యారు.