Telangana Ministers Portfolios Announced: తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన 11మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రులకు శాఖ కేటాయింపు అంశంలో అధిష్టానంతో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో వరుసగా సమావేశమయ్యారు. చివరకి 11మంది మంత్రులకు శాఖలు ఫైనల్‌ చేసి... ఇవాళ ప్రకటించారు రేవంత్‌రెడ్డి.


డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు విద్యుత్‌ శాఖను కూడా కేటాయించారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ ఇచ్చారు. కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఐటీ, ఇండస్ట్రీస్‌, అసెంబ్లీ వ్యవహారాలు శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ, మార్కెటింగ్‌, కోఆపరేషన్‌, చేనేత శాఖలు, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్‌, టూరిజం, కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ శాఖలు, దామోదర రాజనర్సింహకు వైద్య,  ఆరోగ్యశాఖ కేటాయించారు. అలాగే.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారా శాఖ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ, సీతక్కకు  పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇచ్చారు. కొండాసురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ ఇచ్చారు. కీలకమైన హోంశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, సాధారణ పరిపాలనతోపాటు కేటాయింపులు జరపని అన్ని శాఖలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరే ఉన్నాయి.


భట్టి విక్రమార్కకు... తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. 2009లో తొలిసారిగా మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్‌  సాధించారు. ఇప్పుడు 2023లోనూ మధిర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్‌గా పనిచేశారు భట్టి విక్రమార్క.  2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2018 నుంచి తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా పనిచేశారు. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో డిప్యూటీ సీఎంతోపాటు తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. ఆర్థిక శాఖతోపాటు విద్యుత్‌ శాఖను భట్టికి కేటాయించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్‌రావు ఉండగా.. విద్యుత్‌ శాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కడియం శ్రీహరి, మహమద్ అలీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 


కోమటిరెడ్డి వెంకటరెడ్డి... 2004లో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ హయాంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని చేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2011లో  ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. 2014  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు పనిచేశారు. 2018 బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోడ్లు-భవనాల శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి  ఉండగా... రెండు కేబినెట్లలోనూ సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస యాదవ్‌ పనిచేశారు. 


ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి... ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో నీటి పారుదల, పౌరసరఫరాల శాఖను ఉత్తమ్‌కు కేటాయించారు. 2014, 2018లో కేసీఆర్‌ కేబినెట్‌లో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పని చేశారు. 2014లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల  ఉన్నారు. 2018లో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చూసుకున్నారు.


తుమ్మల నాగేశ్వరరావు... ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి  పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కేసీఆర్‌ కేబినెట్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి  కేబినెట్‌లో... వ్యవసాయ, మార్కెటింగ్‌, కోఆపరేషన్‌, చేనేత శాఖలను తుమ్మలకు కేటాయించారు. 2014లో వ్యవ‌సాయ సహ‌కార శాఖ‌ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, 2018లో వ్యవ‌సాయ సహ‌కార శాఖ‌ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పనిచేశారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా  ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1995లో మరోసారి చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 1996లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేశారు. 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రి అయ్యారు. 2001లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్క్ చేశారు. 


జూపల్లి కృష్ణారావు.. 2009 నుంచి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్‌లలో ఆహార, పౌరసరఫరాలు, తూనికలు– కొలతలు, వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా, ఆ  తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ, ధర్మాదాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కేసీఆర్‌ కేబినెట్‌లో  ముందు ఐటీ, పరిశ్రమలు... ఆ తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో... ఎక్సైజ్‌, టూరిజం, కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ శాఖలు  కేటాయించారు. 2014లో ఎక్సైజ్ శాఖ‌ మంత్రిగా టి. పద్మారావు ఉన్నారు. పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా అజ్మీరా చందూలాల్‌ పనిచేశారు. 2018లో ఎక్సైజ్‌, పర్యాటక,  సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రిగా వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.


దుద్దిళ్ల శ్రీధర్‌బాబు... 2009 నుంచి 2014లో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో ఉన్నత విద్యా శాఖ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా  పనిచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో...  ఐటీ, ఇండస్ట్రీస్‌, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కేటాయించారు. 2014 నుంచి 2023 వరకు ఐటీ, ఇండస్ట్రీస్‌ మినిస్టర్‌గా  కేటీఆర్‌ ఉన్నారు. 2014లో అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా హరీష్‌రావు పనిచేశారు. 


దామోదర్ రాజనర్సింహ... 2006లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు  ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో... వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించారు. 2014లో చర్లకోల లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖ  మంత్రిగా పనిచేశారు. 2018లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల పనిచేశారు. ఈటల బీఆర్‌ఎస్‌ను వీడటంతో... ఆ శాఖను హరీష్‌రావుకు అప్పగించారు.


పొన్నం ప్రభాకర్... 2009 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన పొన్నం... హుస్నాబాద్‌ నుంచి తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే..  మంత్రి పదవిని దక్కించుకున్నారు. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. 2014లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ  మంత్రిగా తలసాని శ్రీనివాసయాదవ్‌ పనిచేశారు. 2018లో బీసీ సంక్షేమ మంత్రిగా గంగులకమలాకర్‌, రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఉన్నారు. 


పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా తొలిసారి మంత్రిపదవి చేపట్టారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేని... 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి   కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంరెడ్డి కేబినెట్‌లో పొంగులేటికి... రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారా శాఖ ఇచ్చారు. 2014లో రెవెన్యూ శాఖ మంత్రిగా మహమద్ అలీ,  గృహనిర్మాణ శాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిగా ఉన్నారు. 2018లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ఉన్నారు. 


కొండా సురేఖ...  2009 వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో శిశు మహిళా సంక్షేమ అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు... రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో అటవీ, పర్యావరణ,  దేవాదాయ శాఖ ఇచ్చారు. 2014లో.. అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పనిచేశారు. 2018లో ఇంద్రకరణ్  రెడ్డి... అటవీ, పర్యావరణ. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. 


ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క... తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో సీతక్కకు పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, మహిళా శిశు సంక్షేమ  శాఖలు ఇచ్చారు. 2104లో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు వ్యవహరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు  ఉన్నారు. 2018లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకరరావు ఉన్నారు.