CM Telangana State 2023: తెలంగాణలో కొత్త సీఎంగా ఎవరి పేరును ఖరారు చేయాలనే అంశంపై ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో మల్లిఖార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివ కుమార్ సహా ఇతర ఏఐసీసీ కీలక నేతలు పాల్గొన్నారు. తెలంగాణ పరిణామాలు, నిన్నటి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ తన నివాసానికి వెళ్లిపోయారు. కేసీ వేణుగోపాల్, ఠాక్రే, డీకే శివకుమార్ హైదరాబాద్ కు బయలుదేరారు. సమావేశంలో సీఎం పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్, ఠాక్రే, డీకే శివ కుమార్ హైదరాబాద్ వచ్చాక ఢిల్లీలో ఖరారుచేసిన సీఎం పేరును ఈ సాయంత్రానికి ప్రకటిస్తారని తెలుస్తోంది.
అంతకుముందు కర్ణాటక డిప్యూటీ సీఎం, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివ కుమార్ సీఎం పేరు ఎంపికపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై సీఎల్పీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పడం వరకే తన బాధ్యత అని డీకే శివ కుమార్ చెప్పారు. సీఎం పేరు ఎంపిక మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఉంటుందని చెప్పారు. సీఎల్పీ అభిప్రాయంపై నివేదిక ఇచ్చేందుకే తాను వచ్చానని వెల్లడించారు.
హోటల్ ఎల్లా ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రేవంత్ రెడ్డి సీఎం కావాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్దకు కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు రాగా, వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాసేపటికి హోటలో లోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఓ యువకుడు రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. కలగజేసుకున్న పోలీసులు పెట్రోల్ డబ్బా కింద పడేసి ఆత్మహత్యయత్నం చేసిన యువకుడిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.