Telangana CM KCR Criticises Union Minister Kishan Reddy Over Paddy Procument Issue In Delhi: ఒక దేశం ఒకటే ధాన్య సేకరణ విధానం ఉండాలంటూ తెలంగాణ రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రైతు నేత రాకేష్ టికాయత్ నాగలి బహుకరించారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ చేస్తున్న ఉద్యమనానికి రాకేష్ టికాయత్ మద్దతు తెలిపారు. రైతులను వరి వేయవద్దని, పంట మార్పిడి చేయాలని తమ ప్రభుత్వం సూచించగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలు అన్నదాతలను తప్పుదోవ పట్టించి అన్యాయం చేయారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని అప్పటిలోగా ధ్యానం సేకరణపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. 






 


రైతులు ఏం పాపం చేశారు..
2 వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న ఢిల్లీకి తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులు, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు రావాల్సి వచ్చిందో దేశం మొత్తానికి తెలియాలి. మా రైతులు ఏం పాపం చేశారు. ప్రధాని మోదీకి నేను ఒక్కటే చెబుతున్నా.. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ రైతులతో మాత్రం కాదన్నారు. తెలంగాణ ప్రజలు, రైతులను నూకలు తినమని చెప్పడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇలాంటి వాఖ్యలు చేయడం కేంద్రం అహంకారాన్ని తెలియజేస్తుందంటూ కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం తీరు వల్లే ఈరోజు ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఎంపీ కేశవరావు పార్లమెంట్‌లో కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పారు. కానీ మేం గోల్ మాల్ చేశామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్న ఆయన పీయూష్ గోయల్ కాదని, పీయూష్ గోల్ మాల్ అని ఎద్దేవా చేశారు. 


తెలంగాణకు ఓ వ్యక్తిత్వం, అస్తిత్వం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాకోసం ప్రవేశపెట్టిన పథకాలు పెండింగ్‌లో పెట్టారు. తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగింది. అందుకోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. మా దగ్గర 3 లక్షల బోర్లు వేశారని రాకేష్ టికాయత్ కు తెలిపారు. మేం మా సొంత ఖర్చులతో రైతులకు మోటార్లు బిగించి ఇచ్చాం, దీని కోసం ఎన్నో కోట్లు ఖర్చుచేశామన్నారు. కాకతీయ రాజులు పాటించిన నీటి విధానాన్ని ఉమ్మడి ఏపీ పాలకులు నిర్లక్ష్యం చేశారు.


మహబూబ్ నగర్ జిల్లాలో 35 లక్షల మంది జనాభా ఉంటారు. కానీ అందులో దాదాపు సగం జనాభా పొట్టచేత పట్టుకుని పలు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఐదారు దశాబ్దాల వరకు పరిస్థితి అలాగే ఉన్నది. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసి మా పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ ప్రక్రియలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రజలు, రైతుల పరిస్థితులు చాలా మారాయి. దేశంలో రైతుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభం కావాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తెలంగాణ ప్రజలంతా మీ వెంట ఉంటారని కేసీఆర్ చెప్పారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. 13 నెలలపాటు రైతులు పోరాటం చేస్తే ప్రధాని మోదీ క్షమాపణ కోరారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. దేశ రైతులు బిక్షం అడగటం లేదు, తమ హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.






పంట మార్చాలని రైతులకు చెప్పాం.. కానీ మొత్తం కిషన్ రెడ్డినే చేశారు
రాష్ట్రంలో భూములు, వర్షాలు, పరిస్థితుల ఆధారంగా రైతులు పంటలు వేయడాన్ని మార్చాలని, వేరే పంటలు వేయాలని తమ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర రైతులను కోరినట్లు చెప్పారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మా ప్రభుత్వం మాటలు వినవద్దని, రైతులు తమ ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవాలని కేంద్రం కొంటుందని వారికి మాట ఇచ్చారంటూ కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియోను చూపించారు. రైతు సోదరులు తమకు నచ్చిన పంటలు వేసి ధాన్యం చేతికొచ్చిన సమయంలో కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాటమార్చి వారిని దారుణంగా మోసం చేశారని.. బీజేపీకి, కేంద్రానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. మేం బలహీనులం కాదు, తెలంగాణ ప్రభుత్వం మా ప్రాణాలు అడ్డువేసి రైతులను కాపాడుకుంటుందన్నారు. 


Also Read: Bhadrachalam: భద్రాచలానికి రైలులో వెళ్లిన గవర్నర్‌ - ప్రభుత్వం హెలికాప్టర్ ఇవ్వలేదా? తీసుకోలేదా?


Also Read: TRS Paddy Protest : గల్లీ నుంచి దిల్లీకి మారిన వరి యాక్షన్ - నేడు హస్తినలో టీఆర్ఎస్ రైతు దీక్ష