TRS Paddy Protest : సోమవారం దిల్లీలో టీఆర్ఎస్ రైతు దీక్షకు సర్వం సిద్ధమైంది. రైతు దీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని దిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నేతలు దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుంది. ఈ దీక్షలో 1500 మంది స్టేజ్‌పై కూర్చునేలా భారీగా ఏర్పాట్లు చేశారు. దిల్లీలో టీఆర్‌ఎస్ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ శ్రేణలు దిల్లీకి చేరుకున్నాయి. దీక్ష ఏర్పాట్లను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ద్రోహం చేసిన ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో ఆహార భద్రతకు ముప్పువాటిల్లితుందన్నారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
ఒకే దేశం- ఒకే విధానం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై ఆరు నెలలుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యపు గింజను కూడా కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. దిల్లీ రోడ్లపై తెలంగాణ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారని చెప్పారు. ధాన్యం సేకరణపై గల్లీ నుంచి దిల్లీ వరకు రైతులు పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఒకే దేశం-ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్రం విఫలమయిందని విమర్శించారు.
Also Read : Delhi TRS : ఒకే దేశం - ఒకే ధాన్యం సేకరణ పాలసీ ! ఢిల్లీలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలే