సోమవారం ఢిల్లీలో చేపట్టనున్న ధర్నా కోసం టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.  జాతీయ రైతు సంఘాల ప్రతినిధులందర్నీ ఆహ్వానించారు. కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ భవన్‌లో జరగనున్న ఈ ధర్నా కోసం పదిహేను వందల మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సమన్వయం కోసం నియమితులైన అనేక మంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు. టీఆర్ఎస్ నేతలు ఢిల్లీ లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. కేసీఆర్ చేస్తున్న ధర్నా కేవలం తెలంగాణ కోసంమే కాదని.. దేశంలోని మొత్తం రైతాంగం కోసమని చెబుతున్నారు. వన్ నేషన్ - వన్ పాడీ ప్రొక్యూరమెంట్ పాలసీ విధానం కోసం కేసీఆర్ పోరాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీల్లో చెబుతున్నారు. 



జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఈ ధర్నా ద్వారా ఉత్తరాది రైతుల ఆదరాభిమానాలు పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ధర్నా వేదికపై నుంచి ఆయన రైతులకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి తన వద్ద ఉన్న విజన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ధర్నా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాలని టీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు. 



సీఆర్‌కు ఢిల్లీలో  పీఆర్‌ఓ సంజయ్‌కుమార్‌ ఝాను ప్రభుత్వం నియమించింది సంజయ్ కుమార్ సహారా సమయ్‌, దైనిక్‌ జాగరణ్‌ వంటి హిందీ పత్రికల్లో సంజయ్‌కుమార్‌ పనిచేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై హిందీ మీడియాకు, ఉత్తర భారత ప్రజలకు కేసీఆర్‌ గురించి సమాచారాన్ని తెలిజేయడానికి సంజయ్‌ను ఆయన పీఆర్‌ఓగా నియమించినట్లుగా తెలుస్తోంది. సంజయ్‌కు అవసరమైన భవన, రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు నెలకు రూ.2 లక్షల వేతనాన్ని చెల్లిస్తారు. ఇప్పటికే సంజయ్ కుమార్ ధర్నాకు హిందీ మీడియాలో మంచి కవరేజీ వచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.