ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచిత పథకాలను ప్రకటించడం లేదా అమలు చేయడం ఆపడం వంటి అధికారాలు లేవని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాంటివి రాజకీయ పార్టీల విధానాల నిర్ణయాలని.. ప్రభుత్వాలు విధానపరంగా తీసుకునే నిర్ణయాలను నియంత్రించలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. "ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఏదైనా ఉచితాలను అందించడం, పంపిణీ చేయడం సంబంధిత పార్టీ విధాన నిర్ణయం అలాంటి విధానాలు ఆర్థికంగా లాభదాయమా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయా అన్నది ఓటర్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందే కానీ.. ఈ విషయంలో ఈసీ చేసేదేమీ లేదని తెలిపింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గెలిచిన పార్టీ తీసుకునే రాష్ట్ర విధానాలు మరియు నిర్ణయాలను ఎన్నికల సంఘం నియంత్రించదు. అలాంటి చర్య అధికారాలను అతిక్రమించడమే అవుతుందకని ఈసీ తెలిపింది. కేవలం మూడు కారణాల వల్ల మాత్రమే ఈసీకి రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికాం ఉందని..ఫోర్జరీ ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ జరిగితే.. రాజ్యాంగంపై విశ్వాసం లేదని తేలిపితే.. లేదా ఇలాంటి కారణాలతో మాత్రమే పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారని.. వాటి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని.. అలాగే చాలాపార్టీల అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయడం లేదని అలాంటి పార్టీల గుర్తింపు రద్దు చేయాలని న్యాయవాది అశ్వనీకుమార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎన్నికలకు ముందు ఉచిత హామీలు.. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వల్ల నిష్ఫాక్షికమైన ఎన్నికలు జరగడం లేదని పిల్‌లో అశ్వనీకుమార్ పేర్కొన్నారు.ప్రజా ప్రయోజనాలు లేని అహేతుకమైన ఉచితాల వాగ్దానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 162, 266(3), 282లను ఉల్లంఘించడమేనని..ఆశ్వనీకుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై జనవరి 25న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని ఉచిత పథకాల కోసం వాడకుండా షరతు విధించాలని సుప్రీంకోర్టును అశ్వనీకుమార్ కోరుతున్నారు. దీనిపై ఈసీ అఫిడవిట్‌తో రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఆపలేరని క్లారిటీ వచ్చేసినట్లయింది.
గతంలో ఈసీ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను ఉచిత వాగ్దాలను నియంత్రించేందుకు ప్రయత్నించింది. మేనిఫెస్టోలతో పాటు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ఆదేశించింది. కొన్ని పార్టీలు అలాంటి వివరాలు కూడా సమర్పించాయి. ఇప్పుడుఈసీ అలాంటివి అడ్డుకునే అధికారం లేదని నేరుగా సుప్రీంకోర్టుకే అఫిడవిట్ సమర్పించింది.