Telangana Cabinet Key Decisions: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో 2 గ్యారెంటీల అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ వాహన నెంబర్ ప్లేట్లను TS నుంచి TGగా మార్చాలని నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ తీర్మానాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలైందని వివరించారు.
కీలక నిర్ణయాలు ఇవే
- తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం
- తెలంగాణ అధికార గీతంగా 'జయ జయహే తెలంగాణ'
- వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్ (TS).. టీజీగా (TG) మార్పు
- రాష్ట్రంలో కుల గణన జరపాలని నిర్ణయం
- తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపునకు నిర్ణయం
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం, కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ డేట్ చేసేందుకు ఆమోదం
- సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశంలో చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని.. నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం రేవంత్ తెలిపారు.
Also Read: Harish Rao: సాగునీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలోనే తేల్చుకుందాం - సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ కౌంటర్