CSIR UGC NET December 2023 Result: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్(ఎల్‌ఎస్‌)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించిన జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ (CSIR-UGC-NET) డిసెంబర్‌-2023 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 4న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.


కాగా, డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 356 కేంద్రాల్లో జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 2,19,146 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,75,355 మంది హాజరయ్యారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం ఎన్‌టీఏ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌కు అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.


CSIR-UGC-NET December 2023 ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ ఫలితాల కోసం అభ్యర్థుల మొదట అధికారిక వెబ్‌సైట్‌ https://csirnet.nta.ac.in./ను సందర్శించాలి. 


➥ అక్కడ హోమ్‌‌పేజీలో కనిపించే ‘Joint CSIR-UGC NET DECEMBER-2023 Score Card Live’ లింక్‌పై క్లిక్‌ చేయాలి. 


➥ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.


➥ అభ్యర్థుల CSIR-UGC NET ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. 


➥ అనంతరం స్కోర్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని భవి భద్రపర్చుకోవాలి.


CSIR-UGC-NET December 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ గురించి..


సైన్స్‌ రంగంలో పరిశోధనలు సాగించాలనుకునే ప్రతిభావంతులకు చక్కటి మార్గంగా చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) సాధించిన విద్యార్థులకు ప్రముఖ సంస్థలో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రొఫెసర్‌ /లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 

ఫెలోషిప్‌ ప్రయోజనాలు:

➦ సైన్స్‌ విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ కెరీర్‌ పరంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఇందులో అర్హత పొంది ఫెలోషిప్‌ సాధిస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని గొప్ప సైంటిస్ట్‌లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.

➦ సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతోపాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో రెండేళ్ల పాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్, అలాగే అదనంగా ఏటా కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద రూ.20వేలు పొందవచ్చు.

➦ రెండేళ్ల జేఆర్‌ఎఫ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు పీహెచ్‌డీకి రిజిస్టర్‌ చేసుకుంటే.. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.35 వేలు ఫెలోషిప్‌ లభిస్తుంది.

➦ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టూడెంట్స్, నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్, మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ మైనారిటీ స్టూడెంట్స్‌ వంటి ఫెలోషిప్‌లకు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌లో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. 


లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:

➦ నెట్‌లో అర్హతతో దేశంలోని అన్ని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ/తత్సమాన హోదా ఉన్న సంస్థల్లో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 

➦ తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. నెట్‌/స్లెట్‌లో అర్హత తప్పనిసరి. 

➦ ఐఐటీ, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలకు నెట్‌ /జేఆర్‌ఎఫ్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఓఎన్‌జీసీ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాల కోసం నెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి.