Black OTT release: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘బ్లాక్‘. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. 2005 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలైన 19 సంవత్సరాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐకానిక్ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘బ్లాక్’ స్ట్రీమింగ్
‘బ్లాక్’ ఓటీటీ స్ట్రీమింగ్ విషయన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “సంజయ్ లీలా బన్సాలీ ‘బ్లాక్’ విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు మేము నెట్‌ఫ్లిక్స్ లో తొలిసారిగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాం” అని వెల్లడించింది. ఈ సినిమాలో దేబ్రాజ్ అనే ఉపాధ్యాయుడి పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. చెవిటి మూగ అమ్మాయి పాత్రలో రాణి ముఖర్జీ కనిపించింది.
అమితాబ్ బచ్చన్ ఏమన్నారంటే?
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్, ధృతిమాన్ ఛటర్జీ ఇతర పాత్రల్లో అద్భుతంగా జీవించారు. ‘బ్లాక్’ చిత్రంలోని చక్కటి కథాంశం, నటీనటుల యాక్టింగ్, అద్భుతమైన దర్శకత్వం, పవర్ ఫుల్ డైలాగులు ప్రశంసలు అందుకున్నాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫిబ్రవరి 4, 2005న విడుదలైన ‘బ్లాక్’ చిత్రం అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. సినిమా 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అమితాబ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “బ్లాక్ విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లోకి తీసుకొస్తున్నాం. దేబ్రాజ్, మిచెల్ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని భావిస్తున్నాం” అని రాసుకొచ్చారు.
‘బ్లాక్’ మూవీ గురించి..
అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. థియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా ₹39.83 కోట్లు వసూలు చేసింది. అమితాబ్, రాణి కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ‘బ్లాక్’ మూవీ దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, నటీనటుల సహా అన్ని విషయాల్లో చక్కటి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు, ‘బ్లాక్’ 53వ జాతీయ చలనచిత్ర అవార్డులలో హిందీలో బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ సహా మూడు అవార్డులను గెలుచుకుంది. 2006లో 51వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో, ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్), ఉత్తమ దర్శకుడు (భన్సాలీ), ఉత్తమ నటుడు(అమితాబ్), ఉత్తమ నటి(రాణి ముఖర్జీ) సహా నామినేట్ చేయబడిన మొత్తం 11 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది.ఫిల్మ్ ఫేర్ అవార్డుల చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన చిత్రంగా ‘బ్లాక్’ నిలిచింది.
Read Also: పబ్లిసిటీ కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంది, పూనమ్‌పై పోలీస్ కేసు పెట్టాలి - సినీ వర్కర్స్ అసోసియేషన్