CM Revanth Reddy Comments on Krishna River Project: మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టుల అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనం చట్టంలోనే ఉందని గుర్తు చేశారు. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని గతంలో కేసీఆర్ (KCR) చెప్పారని గుర్తు చేశారు. 'బీఆర్ఎస్ (BRS) తప్పులను కాంగ్రెస్ (Congress)పై నెట్టాలని చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులపై పార్లమెంటులో ప్రశ్నించలేదు. ఈ పుస్తకానికి, చట్టానికి రచయిత కేసీఆర్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


'కేసీఆర్ సంతకాలు చేశారు'


 కృష్ణా నదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి అనే అంశంపై కేంద్రం కమిటీ వేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారని చెప్పారు. దీనిపై అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు కూడా చేశారని.. తద్వారా ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కృష్ణా నీటిలో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరివాహక ప్రాంతం ఎంతైతే రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా కృష్ణా నది నీటి కేటాయింపులు చేశారని ధ్వజమెత్తారు. 'కృష్ణా నదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో కేసీఆర్, అధికారులు సంతకాలు చేశారు. కేఆర్ఎంబీ, బీఆర్ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్ లో రూ.400 కోట్లు కేటాయించారు. అప్పుడు కేసీఆర్ మాట మాట్లాడకుండా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.' అంటూ రేవంత్ ఆరోపించారు. 


కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే..


'కేసీఆర్, హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తోందంటూ అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచగా వీరు సహకరించారు. దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి పోరాటం చేశారు.' అని సీఎం రేవంత్ తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారని రేవంత్ చెప్పారు. రోజుకు 8 టీఎంసీలు ఏపీకి తరలించేందుకు కేసీఆర్ అనుమతిస్తూ మే 5, 2022న జీవో ఇచ్చారని పేర్కొన్నారు. 'గతంలో చంద్రబాబు హయాంలో మచ్చుమర్రి కట్టారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించగా.. అందుకు కేసీఆర్ సహకరించారు. గతంలో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఆధిపత్యం ఉండగా.. వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారు. పదవులు, కమీషన్లకు లొంగి జల దోపిడీకి సహకరించారు. SLBC, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుంటే 10 లక్షల ఎకరాలకు నీరు అంది ఉండేది. ఉమ్మడి ఏపీ కంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణలోనే జరిగింది. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా కేసీఆర్ పదేళ్లు ఏం చేశారు.?' అని సీఎం నిలదీశారు.


'ప్రాజెక్టులపై శ్వేతపత్రం'


'కేఆర్ఎంబీ మినిట్స్ తప్పుగా రాశారు. దీనిపై జనవరి 27న తెలంగాణ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం మేం కొట్లాడుతున్నాం. కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ నాగార్జున సాగర్ డ్యాం ఆక్రమిస్తే కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు. ప్రాజెక్టులపై ఉమ్మడి అసెంబ్లీ ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాం. సాగునీటి ప్రాజెక్టులపై 2 రోజులు ప్రత్యేకంగా చర్చిద్దాం. ఈ అంశంపై కేసీఆర్ ఎంతసేపైనా మాట్లాడొచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


'ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం'


అటు, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్వనాశనం చేశారు. ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ చర్చల్లో ఏం కుట్ర చేశారో.? ఎత్తిపోతల ద్వారా జగన్ రోజుకు 8 టీఎంసీల నీరు ఎత్తుకెళ్తుంటే.. కేసీఆర్ కేవలం 2 టీఎంసీల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నం చేశారు' అని తీవ్రంగా విమర్శించారు.


Also Read: Venkaiah Naidu: 'తెలుగు సినీ కళామ తల్లికి మెగాస్టార్ మూడో కన్ను' - రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు