Venkaiah Naidu Comments on Megastar: కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తించి పద్మ పురస్కారాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని.. పద్మ విభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతోనే అంగీకరించానని చెప్పారు. 'పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. సీఎం రేవంత్ ను అభినందిస్తున్నా. గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారు. రాజకీయాల్లో నానాటికీ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిదీ. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు రెండు కళ్లు అయితే మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను. అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం తన నటనతో ప్రజలను మెప్పించేందుకు ఆయన నిరంతరం శ్రమించారు. ఇతరులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. అందుకు మెగాస్టార్ జీవితమే ఓ ఉదాహరణ. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే' అని ప్రశంసించారు.
వారికి బూత్ లో సమాధానం చెప్పండి
ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని.. అసెంబ్లీ, పార్లమెంటుల్లో జరిగే గలాటాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. నీతి, నిజాయితీ లేని వారికి, ప్రజలను రెచ్చగొట్టే వారికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బూతులు మాట్లాడే నేతలకు ప్రజలు పోలింగ్ బూత్ ల్లోనే సమాధానం చెప్పాలని సూచించారు. కేవలం 4 'సి'లను నమ్ముకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. అవి క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చాలిన అవసరం అందరిపైనా ఉందని అన్నారు.
'పద్మ' గ్రహీతలకు ఘన సన్మానం
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్యను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సత్కరించారు.
'రూ.25 లక్షల నగదు, పెన్షన్'
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం. దీంతోపాటు ప్రతి నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Also Read: Chiranjeevi: నంది స్థానంలో గద్దర్ అవార్డ్స్, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు