RBI Curbs on Paytm Payments Bank: పేటీఎమ్‌లో వందలాది అకౌంట్‌లకు సరైన ఐడెంటిఫికేషన్ లేదని RBI తీవ్ర అసహనంతో ఉంది. అందుకే ఆ కంపెనీపై ఆంక్షలు విధించినట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయా అకౌంట్‌లు Know-Your-Customer (KYC) సరైన విధంగా చేయకుండానే నడుస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్‌ గుర్తించింది. అయినా అదే ఖాతాల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగే ప్రమాదముందని RBI తేల్చి చెబుతోంది. వెయ్యికి పైగా అకౌంట్స్‌ ఒకటే PAN నంబర్‌తో లింక్ అయ్యి ఉండడం ఆందోళన కలిగించింది. రిజర్వ్ బ్యాంక్ వెరిఫికేషన్‌లో ఈ లొసుగు బయటపడింది. మనీ లాండరింగ్ కోసమే ఇలా కొంత మంది ఒకటే ప్యాన్ నంబర్ ఇచ్చి ఉండొచ్చని RBI భావిస్తోంది. ఇదే విషయాన్ని ఈడీతో పాటు హోం మంత్రిత్వ శాఖకి, ప్రధాని కార్యాలయానికి వెల్లడించింది. ఈ వివరాలు పంపింది. Paytm Payments Bank లో ఏవైనా అవకతవకలు జరిగాయని తెలిస్తే వెంటనే ఈడీ రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 


మనీ లాండరింగ్ జరిగిందా..?


మరో కీలక విషయం ఏంటంటే...పేటీఎమ్ గ్రూప్‌లో అంతర్గతంగా కొన్ని భారీ లావాదేవీలు జరిగాయి. వీటికి సంబంధించి ఎలాంటి వివరాలూ లేవు. అందుకే...పూర్తిగా వ్యవస్థపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది రిజర్వ్ బ్యాంక్. దాంతో  పాటు పేరెంట్ కంపెనీ One97 Communications Ltdపైనా నిఘా పెట్టింది. Paytmలో జరుగుతున్న లావాదేవీలకు సరైన భద్రత లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అందుకే...అప్పటికప్పుడు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌ లావాదేవీలపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ప్రస్తుతం సేవింగ్స్‌ అకౌంట్‌లున్న వాళ్లు, వాలెట్స్‌తో పాటు ఫాస్టాగ్‌లు రీఛార్జ్‌లు చేసుకున్న వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. RBI నోటీసుల కారణంగా...పేటీఎమ్ స్టాక్‌పై ప్రతికూల ప్రభావం పడింది. రెండు రోజుల్లోనే 36% మేర పడిపోయింది. అంటే మార్కెట్‌ వాల్యూ పరంగా చూస్తే 2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. 


అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో పేటీఎంకు సంబంధించిన కొన్ని సేవలను అనుమతిస్తారని తెలిపారు. వినియోగదారులు వాలెట్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ‘నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం, బ్యాంకులో మెటీరియల్ పర్యవేక్షణపై ఆందోళనలు తలెత్తడం’ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఎక్స్‌టర్నల్ పార్టీలు కంపెనీ సిస్టంలపై చేసిన ఆడిట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయని ప్రకటించింది. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 2018లో దాదాపు మూడు కోట్ల మంది పేటీయం ద్వారా చెల్లింపులు జరిపేవారు. అక్కడి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి వినియోగదారులు వేరే ఆప్షన్లు పరిశీలించక తప్పదు. ఆర్బీఐ వెబ్‌సైట్ ప్రకారం పేటీయం కస్టమర్‌లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లలో ఎలాంటి పరిమితి లేకుండా మిగిలిన బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు.


Also Read: భారత్ మాతా కీ జై అని అనలేదని విద్యార్థులపై అసహనం - కోపంగా వెళ్లిపోయిన కేంద్రమంత్రి