Meenakashi Lekhi: కేరళలోని కొజికోడ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తీవ్ర అసహనానికి లోనయ్యారు. "భారత్ మాతాకీ జై" అనండి అని ఎన్నిసార్లు చెప్పినా విద్యార్థులు స్పందించలేదు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు. "భారత మాత మీ అందరికీ తల్లి కాదా" అని గట్టిగా ప్రశ్నించారు. వాళ్లందరిలో ఓ మహిళపై వేలు చూపిస్తూ నినాదం చేయండి అని వారించారు. అయినా స్పందన రాకపోవడం వల్ల ఆమె అసహనానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్పీచ్ అంతా అయిపోయాక భారత్ మాతా కీ జై అనండి అని సూచించారు మీనాక్షి లేఖి. ఆ సమయంలోనే ఎవరూ స్పందించకపోవడం వల్ల ఉన్నట్టుండి ఆ వేదికపై నుంచి వెళ్లిపోయారు. "భారత మాత నా ఒక్కదానికే తల్లి కాదుగా. మీకు కూడా అమ్మేగా. చెప్పండి..ఇందులో ఏమైనా అనుమానం ఉందా..? మీ అనుమానమేంటో చెప్పండి" అని గట్టిగా మందలించారు. అయినా అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. ఓ మహిళని నిలబెట్టి నిలదీశారు మీనాక్షి లేఖి. "నేను మీతోనే మాట్లాడుతున్నాను. భారత్ మాతా కీ జై అనండి" అని వారించారు. అయినా ఆ మహిళ అలాగే నిలబడిపోయింది. "మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది" అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం పేరు పలకడానికి కూడా ఇష్టపడని వాళ్లు ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే మంచిది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనమవుతోంది.