Tennis, Davis Cup:  ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌(Pakistan) గడ్డపై డేవిస్‌కప్‌ ఆడుతున్న భారత్‌(Bharat) శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో మొదలైన ప్రపంచ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌, శ్రీరామ్‌ బాలాజీ సత్తా చాటడంతో తొలి రెండు సింగిల్స్‌ను గెలిచి భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-7 (3-7), 7-6 (7-4), 6-0తో అసిమ్‌ ఖురేషిపై నెగ్గాడు. తొలి సింగిల్స్‌లో 43 ఏళ్ల ఖురేషి.. రామ్‌కుమార్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. కానీ మెరుపు సర్వీసులు, బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ఆధిపత్యం ప్రదర్శించాడు. రామ్‌కుమార్‌ మెరుపు విన్నర్లు కొడితే.. ఖురేషి పదునైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో బదులిచ్చాడు. ఈ సెట్‌ కూడా టైబ్రేకర్‌కు మళ్లినా..ఈసారి నిలిచిన రామ్‌కుమార్‌ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక అదే జోరుతో సెట్‌ గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. నిర్ణయాత్మక సెట్లో రామ్‌కుమార్‌ ధాటికి ప్రత్యర్థి నిలువలేకపోయాడు. ఏస్‌లతో విజృంభించిన రామ్‌కుమార్‌ ఒక్క గేమ్‌ కూడా ఖురేషికి ఇవ్వకుండా 6-0తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. 

 

నేడు డబుల్స్‌ మ్యాచ్‌

రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ 7-5, 6-3తో అకీల్‌ఖాన్‌ను ఓడించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో రెండు సెట్లలో ఒక్కోసారి ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన శ్రీరామ్‌.. తేలిగ్గా మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి జంట.. ముజామిల్‌-బర్కతుల్లా జోడీని ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రపంచ గ్రూప్‌-1 దశకు భారత్‌ అర్హత సాధిస్తుంది. ఓడితే రివర్స్‌ సింగిల్స్‌ ఆడాల్సి ఉంటుంది. 

 

అయిదంచెల భద్రత

పాకిస్థాన్‌ చేరుకున్న అయిదుగురు సభ్యుల భారత జట్టుకు అధ్యక్ష తరహా భద్రతను కల్పించారు. ప్లేయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవడంతో.. ఎక్కడా రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాకిస్థాన్‌ టెన్నిస్‌ సమాఖ్య(Pakistan Tennis Federation) తెలిపింది. భారత బృందం చుట్టూ నాలుగు లేదా ఐదంచెల భద్రతా వలయం ఉంటుందని చెప్పింది. 1964లో చివరిసారి భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించింది. 1973, 2019లో తటస్థ వేదికలపై పాక్‌తో తలపడింది. అయితే, ఈసారి వేదికను మార్చాలని అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న పాకిస్తాన్‌కు వెళ్లలేదు.

 

డేవిస్‌ కప్‌ జట్టు: రోహిత్‌ రాజ్‌పాల్‌(కెప్టెన్‌), యుకీ బ్రాంబీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌, ఎన్‌.శ్రీరాం బాలాజీ, సాకేత్‌ మైనేని, నికీ కలియండా పూనచ, దిగ్విజరు ఎస్డీ ప్రజ్వల్‌ దేవ్‌(రిజర్వ్‌).