Chandrababu Attends TDLP Meeting Today: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం అమరావతికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం అమరావతికి చేరుకోనున్న ఆయన.. పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న టీడీఎల్పీ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ఎన్‌టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఏపీ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సాగించాల్సిన పోరాటం తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేయనున్నారు.
ఎన్నికలు నేపథ్యంలో జోరు పెంచాలని
బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక అంశాలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించేలా కీలక సూచనలు చంద్రబాబు చేయనున్నారు. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించేందుకు అనుగుణమైన ప్రణాళికలతో తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు కీలక అంశాలపై చర్చించేలా నేతలకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపైనా పోరాడేందుకు ఈ సమావేశాలను వినియోగించుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉంది. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, టికెట్లు రాని, ఇవ్వని మరికొంత మంది ఎమ్మెల్యేలతోనే చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు గుప్పించే అవకాశముందని చెబుతున్నారు. ఎన్నికలు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో అసెంబ్లీలో లేవనెత్తే అంశాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నందున పకడ్బందీ వ్యూహాలతో ప్రతిపక్షం సిద్ధమవుతోంది.
సమావేశాలు జరిగేదిలా
ఈ నెల ఐదో తేదీన ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ నెల ఆరో తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఐదో తేదీన నిర్ణయించనున్నారు. ప్రతిపక్షం వ్యూహాలకు తగిన రీతిలో బదిలిచ్చేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలపై చర్చించే బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించినట్టు చెబుతున్నారు.