Girl Students Forceful Death in Bhongir District: యాదాద్రి భువనగిరి (Bhongir) జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శనివారం రాత్రి విషాదం జరిగింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) హాస్టల్ లో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే శనివారం స్కూలుకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం హాస్టల్ కు వచ్చారు. తర్వాత వసతి గృహంలో నిర్వహించే ట్యూషన్ కు హాజరు కాలేదు. టీచర్ పిలిచినా.. తాము రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజనానికి కూడా రాకపోవడంతో ఓ విద్యార్థిని వారి గది వద్దకు వెళ్లి చూడగా.. ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకుని కనిపించారు. ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా.. వారు వెంటనే అంబులెన్సును రప్పించి ఇద్దరినీ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
అదే కారణమా.?
స్నేహితులైన ఇద్దరు బాలికలు తమను వేధింపులకు గురి చేశారంటూ కొందరు 7వ తరగతి విద్యార్థినులు పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె వసతి గృహం వార్డెన్ శైలజకు సమాచారం ఇవ్వగా.. ఆమె ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో తమపై ఫిర్యాదు చేశారనే మనస్తాపంతో, అవమానంగా భావించిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
'ఇద్దరినీ ఒకే చోట సమాధి చెయ్యండి'
విద్యార్థినుల సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. 'మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని మాటలు అంటుంటే వాటిని తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని శైలజ మేడం తప్ప ఎవ్వరూ నమ్మడం లేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక ఇలా వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకే చోట సమాధి చెయ్యండి.' అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఈ క్రమంలో పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ, ట్యూషన్ టీచర్ ను విచారించారు. హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ కారణంగానే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో తెలిపారు.
పేరెంట్స్ ఆందోళన.. ఉద్రిక్తత
మరోవైపు, తమ పిల్లల మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు. బాలికల బలవన్మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. పిల్లలు మృతి చెందిన సమాచారం తమకు హాస్టల్ అధికారులు ఇవ్వలేదని.. సూసైడ్ లెటర్ కూడా అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. వసతి గృహ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు భారీగా మోహరించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Hyderabad News: మణికొండ: కారు వెనక సీట్లో డెడ్ బాడీ, నోటి నుంచి రక్తస్రావం!