Mass Wedding Fraud in UP: ఉత్తరప్రదేశ్‌లో భారీ వెడ్డింగ్ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యాక కానీ ఈ స్కామ్ బయటపడలేదు. కొంత మంది యువతులు తమకు తామే పూలదండలు వేసుకున్న వీడియోపై ఆరా తీస్తే అసలు డొంకంతా కదిలింది. అయితే...ఇందులో కొంత మంది యువకులు పెళ్లి కొడుకుల్లా తయారై పక్కన ఊరికే నిలబడ్డారు. కానీ పూల దండలు మాత్రం యువతులు తమకు తామే వేసుకున్నారు. ఇదే అనుమానాలకు తావిచ్చింది. జనవరి 25వ తేదీన ఈ సామూహిక వివాహాలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో దాదాపు 568 జంటలు పాల్గొన్నాయి. అయితే...ఈ స్కామ్‌ బయటపడ్డాక విచారణ చేపట్టగా వాళ్లందరికీ డబ్బులిచ్చి అలా పెళ్లి కూతురి గెటప్ వేశారని తేలింది. ఈ స్కామ్‌పై స్థానికులు కీలక విషయాలు వెల్లడించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గెటప్‌ వేసినందుకు ఒక్కొక్కరికీ రూ.500 నుంచి రూ.2 వేల వరకూ ఇచ్చారని చెప్పారు. కొంత మంది యువకులు ఆ సమయానికి దొరకలేదని, అందుకే వధువులే తమకు తాముగా పూలదండలు వేసుకున్నారని వివరించారు. 


"అక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయని మాకు తెలిసింది. ఊరికే చూద్దామని అక్కడికి వెళ్లాను. కానీ ఇంతలోనే కొంత మంది వచ్చి నాతో మాట్లాడారు. అక్కడ కూర్చుంటే డబ్బులిస్తామని అన్నారు. అలా చాలా మందిని అక్కడ డబ్బులిచ్చి కూర్చోబెట్టారు"


- స్థానికుడు 






చీఫ్‌గెస్ట్‌గా బీజేపీ ఎమ్మెల్యే  


ఇక్కడ కీలక విషయం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే కేత్కీ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆయన చీఫ్‌గెస్ట్‌గా రావడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు. అయితే...ఈ స్కామ్‌పై ఆయనను ప్రశ్నించగా తనకు రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చారని, తనకూ అనుమానం వచ్చిందని వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇలా సామూహిక వివాహాల్లో ఒక్కటవుతున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.51,000 నగదు అందిస్తోంది. ఇందులో రూ.35 వేలు వధువుకి, రూ.10 వేలు పెళ్లి బట్టలకి, రూ.6 వేలు వివాహ ఖర్చులకి ఇస్తోంది. దీనికి ఆశపడి కొంత మంది ఇలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల వివరాలన్నీ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తరపున వాళ్లకు ఒక్క రూపాయి కూడా అందలేదని తెలిపారు. 


Also Read: డబ్బుకి ఆశపడి పాక్‌కి గూఢచర్యం, ఇండియన్ ఎంబసీ ఉద్యోగి అరెస్ట్