Telangana BJP :  రాజకీయాల్లో విజయాలు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీకి ఓట్లు వేయడం. రెండు రాజకీయ పార్టీ కష్టపడి పోరాటాలు చేసి ప్రజల మనసుల్ని గెలుపొందడం. బీజేపీ మొదటి దాన్నె ఎక్కువగా ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. 


అవినీతి ఆరోపణల తప్ప మరో పోరాటం చేయని బీజేపీ !


 బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, కవితలను టార్గెట్ చేస్తే చాలన్నట్లుగా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం బీజేపీ మీటింగ్ అంటే.. స్వచ్చందగా జనాలు వచ్చేంతగా ఊపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అది రివర్స్ అయిపోతోంది. బండి సంజయ్ ఐదో విడత పాదాయత్ర పూర్తి చేశారు.   ఈ పాదయాత్రను బీఆర్ఎస్  సీరియస్‌గా తీసుకోలేదు. కాంగ్రెస్ కూడా పట్టించుకోలేదు. ప్రజలు కూడా పట్టించుకోలేదని.. కరీంనగర్ సభకు వచ్చిన జనాన్ని చూస్తే అర్థమైపోతుందన్న అభిప్రాయం  తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిస్తోంది. 


బీజేపీకే ప్రజలు ఎందుకు అధికారం ఇవ్వాలి ? 
 
బీజేపీ నేతల ఉత్సాహం.. రాజకీయం అంతా టీఆర్ఎస్‌పై వ్యతిరేకతను పెంచడానికే చూపిస్తున్నారు. అదే పనిగా విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందగలమని అనుకుంటున్నారు .. కానీ ప్రత్యామ్నాయంగా తమనే ఎందుకు ఆదరించాలో ప్రజలకు చెప్పడం లేదు. పాదయాత్ర చేసినా.. మరో రాజకీయ కార్యక్రమం చేపట్టినా.. వారి ఎజెండా  బీఆర్ఎస్‌కు.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించడమే అజెండాగా ఉంటోంది. దీంతో బీజేపీ పట్ల ప్రజల్లో రానురాను ఆసక్తి తగ్గిపోతోంది.  బీజేపీ తీరు చూస్తూంటే ప్రధానంగా టీఆర్ఎస్‌పై వ్యతిరేకతనే నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే  రొటీన్ రాజకీయం చేస్తున్నారు. కానీ అంతకు మించి చేయాల్సిన అవసరం ఉందనేది ఎక్కువ మంది చెప్పే మాట.


గెలవాలంటే అధికార పార్టీపై వ్యతిరేకత సరిపోదు ! 


ఏదైనా  రాజకీయ పార్టీ ప్రజల ఆదరణ పొందాలంటే.. కేవలం అధికార పార్టీపై వ్యతిరేకతను నమ్ముకుంటే చాలదు. కేసీఆర్‌పై వ్యతిరేకతతో ప్రజలు తమకు ఓటేస్తారనుకుంటే..  అంతకంటే రాజకీయ అవగాహనాలోపం ఉండదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ రూపంలో మరో ప్రత్యామ్నాయం ప్రజల కళ్ల ముందు  ఉంది. ప్రభుత్వాన్ని మార్చాలని ఫిక్సయిపోతే.. బీజేపీకే ఎందుకు చాన్సివ్వాలన్న  ఆలోచన ప్రజలకు వస్తుంది. ఇలాంటి సమయంలో ప్రజలు తమ వైపే ఉండేలా .. బీజేపీ నేతలు కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంది. కానీ అలాంటివేమీ జరగడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


బండి సంజయ్ ఒక్కరే తెరపై !
 
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క బండి సంజయ్ మాత్రమే తెర మీద కనిపిస్తున్నారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ , డీకే అరుణ ఇలా ఎవరూ పెద్దగా కార్యక్రమాలు చేయడం లేదు. దీంతో పార్టీ ఉంటే బండి సంజయ్ పాదయాత్రలో లేకపోతే..  సైలెంట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  కేసీఆర్‌ను ఓడించాలంటే ... కేవలం వ్యతిరేకత మీద ఆధారపడితే సరిపోదు.. అంతకు మించిన రాజకీయ పోరాటం చేయాల్సి ఉంది. కేసీఆర్ కంటే తాము బెటర్ అని ప్రజల్ని మెప్పించాల్సి ఉంటుంది. అందు కోసం ఏం చేయగలమన్నది బీజేపీ నేతలు తేల్చుకోవాల్సి ఉందంటున్నారు.