‘‘కేసీఆర్....రాష్ట్రంలో ధాన్యం కొనేందుకు సిద్ధమని కేంద్రం లేఖ ఇచ్చి నెలలు దాటుతున్నా రైతుల నుంచి ఇంకా ఎందుకు ధాన్యం సేకరించడం లేదు? నరుకుతా...ముక్కలు చేస్తానంటూ టైం పాస్ చేస్తూ రైతులను ఎందుకు మోసం చేస్తున్నవ్. అసలు రైతుల నుండి ధాన్యం కొంటవా? కొనవా? ఏడేళ్లుగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందెవరో చెప్పే దమ్ముందా? కేంద్రం కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతావా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత బంధుపథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ బాబూ జగ్జీవన్ రాం చౌరస్తా నుంచి లిబర్టీ అంబేద్కర్ చౌరస్తా వరకు డప్పుల దరువు మోగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పలువురు దళిత నేతలు హాజరయ్యారు.
Also Read: కొత్త మద్యం దుకాణాల షెడ్యూల్ విడుదల... స్థానికులకే లిక్కర్ షాపులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
అదేమైనా అంతర్జాతీయ రహస్యమా..?
దళిత బంధు పథకాన్ని ఈ నెల 4 నుంచి అమలు చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేయాల్సిందేనన్నారు. అప్పటి వరకు ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఆయన.. ఇప్పుడే యుద్ధాన్ని ప్రారంభించామన్నారు. 'దళిత సీఎం చేస్తానని ఎవరైనా అడిగిండ్రు? చేస్తానన్నవ్ కదా... మరి ఎందుకు మాట తప్పినవ్. కొన్ని కారణాలవల్ల చేయలేకపోయినన్నవ్. ఆ కారణాలేందో చెప్పు. అదేమైనా అంతర్జాతీయ రహస్యమా? మాట ఇచ్చినవ్ కాబట్టే నువ్వు సీఎం అయినవని గుర్తుంచుకో... నువ్వెన్ని మాటలు చెప్పినా దళితుణ్ని సీఎం చేసే వరకు నిన్ను వదిలిపెట్టం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిందే. నువ్వు సీఎం సీటు నుండి దిగిపోవాల్సిందే." అని బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Also Read: ‘భయ్యా తోడా పియాజ్ డాలో’ అంది.. లేవని చెప్పడంతో ఎంత పని చేసిందో చూడండి
కేసీఆర్ ఎందుకు ఓటు వెయ్యలేదు
దళిత బంధుపై టీఆర్ఎస్ కుంటి సాకులు చెబుతోందని బండి సంజయ్ ఆరోపించారు. నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే కాకుండా హుజూరాబాద్ లో అకౌంట్లో వేసిన 17 వేల దళితులకు వెంటనే నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని దళితులందరికీ రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో కేసీఆర్ ఎందుకు ఓటు వెయ్యలేదని ప్రశ్నిస్తే ఆ విషయం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. ఆనాడు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న విజయశాంతి స్పీకర్ పై దాడి జరగకుండా అడ్డుకుని బిల్ పాస్ చేయించారని గుర్తుచేశారు. భారత్ కన్నా అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లను కేసీఆర్ పొగడటం సిగ్గుచేటన్నారు. శ్రీలంక జీడీపీ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ కు ఆ దేశంలో రేట్లు ఎలా ఉన్నాయో తెలియదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !
కేంద్రం సిద్ధంగా ఉంది
ధాన్యం గురించి కేంద్రాన్ని బద్నాం చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ ఏడేళ్లలో ధాన్యం కొన్నదెవరో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వానా కాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినా ఇంకా ఎందుకు కొనడం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యమంతా రోడ్లపై పోసి కొనేవాళ్లు లేక రైతులు అల్లాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ను టచ్ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ గాండ్రింపులకు బెదిరే పార్టీ బీజేపీ కాదన్నారు.
Also Read: నెటిజన్ ట్వీట్ తో హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు