తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుటుంబానికి రెండు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్...పీఈసీ సమావేశంలో రెండు సీట్ల అంశంపై సీరియస్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. పది రోజుల్లో సీట్ల ప్రక్రియ పూర్తయ్యే కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మధ్య రెండు సీట్ల అంశం చర్చకు వచ్చింది. కుటుంబానికి రెండు సీట్ల అంశం ఇపుడెందుకంటూ... ఉత్తమ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎవర్ని లక్ష్యంగా చేసుకొని సమావేశం జరుగుతోందంటూ..ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గం కోసం ఉత్తమ్ పద్మావతి దరఖాస్తులు సమర్పించారు. కోదాడ,హుజుర్ నగర్ స్థానాలకు... పోటీగా జార్జిరెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇదే ఉత్తమ్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఇదే సమావేశంలో రెండు సీట్లపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ప్రస్తావించారు. ఏదో ఒకటి చెప్పాలని పీఈసీ సభ్యులను నిలదీసినట్లు తెలుస్తోంది. సర్వేలపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సీరియస్ అయ్యారు. అసలు సర్వే ఎలా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తున్నపుడు...ఈ ప్రక్రియ అంతా ఎందుకని ప్రశ్నించారు. కొన్ని నియోజకవర్గాలకు రెండే దరఖాస్తులు వస్తే... తమ నియోజకవర్గాలకు 20 దరఖాస్తులు ఎలా వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ స్థానం నుంచి పద్మావతి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి...బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్...2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉత్తమ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో...అదే స్థానం నుంచి పద్మావతి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఉపఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు...రెండు సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, అమె తనయుడు, కరీంనగర్ స్థానానికి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు. ఆమె కొడుకు గాంధీభవన్ లో దరఖాస్తులు సమర్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా మూడు స్థానాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్, జై వీర్ లు రెండు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు.
సెప్టెంబరు 2న మరోసారి భేటీ కానుంది పీఈసీ. మొదటి విడతలో 40 నుంచి 50 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులనే ప్రకటించేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు... హైదరాబాద్ రానున్నారు. పీఈసీ సభ్యులతో విడివిడిగా భేటీ అయి...అభిప్రాయాలు సేకరించనున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు డీసీసీ అధ్యక్షుల సలహాలు స్వీకరించనుంది స్క్రీనింగ్ కమిటీ.