నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామన్నారు. భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటీఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్‌ గద్దె దిగిపోవాల్సిందేనన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు రెండు నెలలు ఓపిక పట్టాలని సూచించారు. సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదన్న రేవంత్ రెడ్డి, గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల రద్దుతో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. 


అబాండాలు వేయడం సరికాదు
పోటీ పరీక్షలు రాసే విద్యార్థిని హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరో విధంగా ప్రచారం చేస్తున్నారని  రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థిని రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణం స్పష్టంగా చెప్పిందని, చనిపోయిన విద్యార్థినిపై అబాండాలు వేయడం సరికాదని పోలీసులకు సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్న రేవంత్ రెడ్డి, అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్‌ గద్దె దిగడమేనని స్పష్టం చేశారు. 32 లక్షల మంది యువత ఆందోళనలో ఉన్నారన్న ఆయన, జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జరిగిన పరిణామాలకు టీఎస్‌పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదన్నారు. తెలంగాణలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన వివరాలు త్వరలోనే ప్రకటిస్తానన్నారు. 


నేడు అభ్యర్థుల తొలి జాబితా
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం విడుదల చేయనుంది. 58 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు ఉంటాయని నేతలు తెలిపారు. వామపక్షాలతో పొత్తుపై చర్చలు కూడా తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసే నేతలకే అవకాశం ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అన్ని మతాలు, కులాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు. 


ప్రవళ్లిక ఆత్మహత్య
పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రవళ్లిక తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పరీక్షలు వాయిదా పడటంతో ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకోలేదని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రేమ వ్యవహారం కారణంగా ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. శివరాం అనే వ్యక్తితో ప్రవళ్లిక ప్రేమలో ఉందని, శివరాంకు ఈ మధ్య మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్నారు. ఈ విషయం తెలిసి మనస్థాపం చెందిన  ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ప్రవళ్లిక రాసిన సూసైడ్ నోట్ దొరికిందని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామన్నారు. రిపోర్ట్ ఆధారంగా శివరాంపై చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.  ప్రవళ్లిక మరణానికి,  పరీక్షల వాయిదాకి సంబంధం లేదన్నారు. 15 రోజుల క్రితమే హాస్టల్ లో చేరిందని, ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని స్పష్టం చేశారు.