Telangana Government Approves Caste Census Resolution: కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ (Telangana Assembly) శుక్రవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ దీన్ని స్వాగతిస్తూనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, మంత్రులకు మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని.. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. న్యాయ విచారణ కమిషన్ వేయాలని.. బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరారు. కులగణన కోసం బిల్లు తెస్తే తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో బిల్లును ఆమోదించుకుందామని అన్నారు. అయితే, దీనిపై స్పందించిన మంత్రి పొన్నం.. కులగణనకు చిత్తశుద్ధి అవసరమని, బిల్లు కాదని అన్నారు. కాగా, ఈ తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. శుక్రవారం ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.
ప్రతిపక్ష నేతల వాదన ఇదీ
అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. 'జనం, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు. కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది. తీర్మానానికి చట్ట బద్ధత అయినా కల్పించాలి. లేదా న్యాయపరంగా అయినా ముందుకు వెళ్లాలి. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.' అని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అయితే, పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. తీర్మానం కాదు చట్టం చేయాలని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకూ అవకాశం ఉండకూడదని చెప్పారు. 'కులగణన పూర్తి కాగానే వెంటనే చట్టం చేస్తే బాగుంటుంది. ఈ ప్రక్రియ తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.' అని పేర్కొన్నారు. ఎంబీసీలను మొదట గుర్తించినదే తెలంగాణ సీఎం కేసీఆర్ అని గంగుల ఈ సందర్భంగా అన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని.. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ లో ఇప్పటికే కుల గణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ కౌంటర్
ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీసీ కులగణన విషయంలో ఎలాంటి అపోహలొద్దని.. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ ఉద్దేశమని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టారా.? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం ప్రవేశపెట్టామని.. ఎవరూ అడగకుండానే సభలో ప్రవేశపెట్టామని అన్నారు. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. 'కులగణనపై చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోంది. కులగణనను అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులపై అనుమానం ఉంటే సూచనలివ్వండి. అంతేకానీ, తీర్మానానికే చట్టబద్ధత లేదన్నట్లుగా మాట్లాడడం మనందరికీ మంచిది కాదు. మేం రహస్యంగా ఏమీ చేయడం లేదు. ఈ తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉండొచ్చు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాం. లెక్కలు బయటకు వస్తే 50 శాతం జనాభా ఉన్న వాళ్లకు రాజ్యాధికారంలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందోనన్న బాధ ఉంటుందేమో.?. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది పక్కన కూర్చోవడంతో ఆయన్నూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంత మంచి తీర్మానం చేసినప్పుడైనా దాన్ని స్వాగతించి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సహేతుకమైన సూచనలను మేం పరిగణలోకి తీసుకుంటాం.' అని రేవంత్ స్పష్టం చేశారు.