Telangana Politics :  8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్‌ఎస్ ఎంపీలు  బీజేపీతో  టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఎన్డీఏలో జరుగుతోందని ఢిల్లీ నుంచి  జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.   ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో మేము 17కి 17సీట్లు గెలుస్తామని.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదన్నారు. 


బీజేపీ గెలిచి ఉంటే ఈ పాటికి జైలుకే ! 


బీఆర్‌ఎస్‌కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారన్నారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి ఎవరు హరీష్ రావుతో సహా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు అవగాహన ఒప్పందం ఉందన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఇన్ని స్కాంలు బయటపడుతున్న చర్యలు కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లన్నారు. గ్రౌండ్ లెవెల్‌లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. 


గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం 


కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. కేఏ పాల్ కూడా 17సీట్లు గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒక్కవైఫు , రజాకార్లు, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు. బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిందని బండి సంజయ్ చెప్పారు. కాళేశ్వరంపై సెంట్రల్ కమిటీ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం పనికి రాదని చెప్పిందని అన్నారు. ప్రజా సమస్యలు ఏమీ లేనట్లు ఒక నది జలాల విషయం పట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటున్నాయని చెప్పారు.


కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీష్ రావుకు  బీజేపీలోకి ఆహ్వానం 


అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీని ప్రజలే బహిష్కరిస్తారన్నారు. ఏ ప్రభుత్వం అయిన ఐదు ఏళ్లు ఉండాలని కోరుకుంటామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కి బుద్ది చెప్తారని బండి సంజయ్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని ఆరోపించారు… అప్పుడు కూడా కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు… అప్పుడెందుకు సీబీఐ ఎంక్వైరీ అడిగారు … ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు. తాము హైదరాబాద్ పార్లమెంట్ సీటుపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీశ్ రావును బీజేపీలోకి తీసుకుంటామని చెప్పారు.