Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలోని మరో నియోజకవర్గం పాతపట్నం. ఈ నియోజకవర్గం అసెంబ్లీకి 1952లో జరిగిన తొలి ఎన్నిక కంటే ముందు నుంచి ఉంది. నియోజకవర్గంలో 2,36,155 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,18,706 మంది కాగా, మహిళ ఓటర్లు 1,17,439 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో ఎనిమిదిసార్లు కాంగ్రెస్‌ విజయం సాధించగా, ఐదుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఏర్పాటైన తరువాత రెండుసార్లు ఈ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దక్కించుకోగా, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలుపొందారు. ఎన్‌టీఆర్‌ టీడీపీ ఏర్పాటు చేసిన లక్ష్మిపార్వతి ఇక్కడ ఒకసారి విసయాన్ని దక్కించుకున్నారు. 


కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచిన నియోజకవర్గం


ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా ఎనిమిదిసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ద్విసభ్య స్థానానికి జరిగిన ఎన్నికల్లో పెంటన్నాయడు ఇండిపెంటెంట్‌ అభ్యర్థిగా బరిలోకి విజయం సాధించారు. కేఎల్పీ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి ఎమ్‌ఎస్‌ నారాయణపై 81 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ద్విసభ్య స్థానానికి 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎల్‌ లక్ష్మణదాస్‌ తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి బరిలోకి దిగిన డి గోవిందరాజులపై 8190 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పుడే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ననుంచి పోటీ చేసిన పి గున్నయ్య తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి బరిలో నిలిచిన జి రాములపై 14,308 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఎల్‌ లక్ష్మణదాస్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన డి గోవిందరాజులపై 11,129 విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఎల్‌ లక్ష్మణదాస్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సంపత్‌రావుపై 6811 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పి గున్నయ్య తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఎస్‌ రాజయ్యపై 394 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సుక్క పగడాలు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎస్‌ రాజయ్యపై 8086 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె మోహనరావు తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఎల్‌ లక్ష్మణదాస్‌పై 824 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983లో జరిగిన టీటీ నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె మోహనరావుపై 6341 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన డి నారాయణరావు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎం లోకనాధంపై 5574 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె మోహనరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన డి నారాయణరావుపై 274 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె మోహనరావు మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డి నారాయణరావుపై 11,536 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె మోహనరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి హరిబాబుపై 10,555 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె మోహనరావు మరోసారి ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి హరిబాబు నాయుడిపై 2064 ఓట్ల తేడా విజయాన్ని దక్కించుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన కె వెంకటరమణమూర్తిపై 20,970 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కె వెంకటరమణమూర్తి ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎస్‌ విజయరామరాజుపై 3865 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి శాంతి ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి కె వెంకట రమణపై 15,551 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా సీట్లు కోసం ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఇరు ప్రధాన పార్టీలకు ముఖ్యం కావడంతో అందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.