YSRCP Focused On East Godavari : తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో  కాపులకు ప్రాధాన్యత ఇస్తోంది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో...ఆరు సీట్లను కాపులకే కేటాయించేసింది. మిగిలిన సామాజిక వర్గాలు టికెట్ కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నా...కుదరదని ముఖం మీద చెప్పేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతటా ప్రయోగాలు చేస్తున్న వైసీపీ...కాకినాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం కాపులకే పెద్ద పీట వేయడం చర్చ నీయాంశంగా మారింది. 


ఏడులో ఆరు సీట్లు కాపులకే
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను బేరీజు వేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఎక్కడికక్కడ సీట్లు చించేస్తున్నారు. ఇప్పటి దాకా 72 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కమ్మ, కాపు, రెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. కాకినాడ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఒక్క కాకినాడ సిటీ మినహా మిగతా ఆరు చోట్ల కాపులకు అవకాశం ఇచ్చింది వైసీపీ. పెద్దాపురం నియోజకవర్గం సీటు మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగిరింది. ఇక్కడ టీడీపీ తరపున నిమ్మకాలయ చినరాజప్ప గెలుపొందారు. 


60శాతం కాపు ఓటర్లే
కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో దాదాపు 60 శాతం కాపు ఓటర్లు ఉన్నారు. ఈ సారి కూడా అభ్యర్థుల్ని మాత్రమే మార్చింది తప్ప సామాజిక సమీకరణల్ని మార్చేందుకు ప్రయత్నించలేదు. కాకినాడ జిల్లాలో బీసీ నేతలు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినా వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. కాపు ఈక్వేషన్‌ను కదిలించకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే కాపులకే సీటు కేటాయిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదని భావించింది. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత...ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లను కాపులకే కేటాయించింది. కారణం ఏంటంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. కాకినాడ ఎంపీ సీటుతో పాటు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన లెక్కలు వేసుకుంటోంది. 


వైసీపీ వైపు మొగ్గు చూపిన కాపులు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు ఓటర్లు తమవైపే మొగ్గుచూపారన్నది వైసీపీ లెక్క. ఈ ఎన్నికల్లో కాపు ఓట్లు రావాలంటే జిల్లాలో వేరే సామాజిక వర్గం జోలికి వెళ్ళకపోవడమే మంచిదని...జిల్లా నేతలు పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ జిల్లా పరిధిలో కాపులకు తప్ప ఇతరుల జోలికి వెళ్ళకూడదని వైసీపీ నిర్ణయించింది. మొదట్లో మరో సామాజికవర్గానికి అవకాశం ఇద్దామని భావించినా... సర్వే రిపోర్టుల ఆధారంగా కాపులకే ఇవ్వాలని డిసైడ్ అయింది వైసీపీ. అటు అమలాపురం లోక్‌సభ  పరిధి లో ఇద్దరు బీసీలకు ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ టిక్కెట్‌తో పాటు దాని పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్‌ కూడా బీసీలకు ఇచ్చింది. దీంతో కాకినాడ పార్లమెట్ నియోజకవర్గంలో కాపు వ్యూహమే కరెక్ట్‌ అన్న నిర్ధారణకు వచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా... ఒక్కసారి తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో ఇక్కడ కాపులు గెలుస్తూ వస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కాపు అభ్యర్థులు ఉంటేనే లోక్‌సభ సీటు కూడా వర్కౌట్ అవుతుందన్న వైసీపీ లెక్కలు వేసుకుంది.