Caste Census Resolution in Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కుల గణన చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేసి.. ప్రజల ఆర్థిక స్థితి గతులు తెలుసుకుంటామని అన్నారు. సర్వేలో అన్ని వివరాలు పొందు పరుస్తామని.. సర్వ రోగ నివారిణిలా సర్వే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత కడియం తెలిపారు.


'ఇది చారిత్రాత్మకం'


'అసెంబ్లీలో బీసీ కులగ‌ణ‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం దేశ చ‌రిత్ర‌లోనే చారిత్రాత్మ‌కం. దేశంలోని సంప‌ద‌, రాజ్యాధికారం జ‌నాభా దామాషా ప్ర‌కారం ద‌క్కాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందు కోసమే ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేస్తామ‌ని చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా కుల‌గ‌ణ‌నతో పాటు  సోష‌ల్‌, ఎకాన‌మిక్‌, ఎడ్యుకేష‌న్‌, పొలిటికల్, ఎంప్లాయిమెంట్ అంశాల‌పై స‌ర్వే చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగ‌త‌ల‌పై స‌ర్వే నిర్వహిస్తాం. ఈ స‌ర్వే ద్వారా సంప‌దను అన్ని వ‌ర్గాల‌కు జ‌నాభా ద‌మాషా ప్ర‌కారం ఎలా పంచాల‌న్న‌ దానిపై ప్ర‌ణాళిక‌లు త‌యారు చేస్తాం. సామాజిక ఆర్ధిక రాజకీయ మార్పున‌కు పునాదిగా తెలంగాణ మార‌బోతుంది.' అని భట్టి తెలిపారు.


స్వాగతిస్తాం.. కానీ


అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. 'జనం, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు. కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది. తీర్మానానికి చట్ట బద్ధత అయినా కల్పించాలి. లేదా న్యాయపరంగా అయినా ముందుకు వెళ్లాలి. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.' అని పేర్కొన్నారు.


దీనిపై మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రతిపక్షాలకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వొచ్చని.. దానిపై ప్రత్యేక చర్చ చేయండి అంటూ వ్యాఖ్యానించారు.


'చట్టం చేస్తేనే..'


ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అయితే, పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. తీర్మానం కాదు చట్టం చేయాలని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకూ అవకాశం ఉండకూడదని చెప్పారు. 'కులగణన పూర్తి కాగానే వెంటనే చట్టం చేస్తే బాగుంటుంది. ఈ ప్రక్రియ తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.' అని పేర్కొన్నారు.


ఎంబీసీలను మొదట గుర్తించినదే తెలంగాణ సీఎం కేసీఆర్ అని గంగుల ఈ సందర్భంగా అన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని.. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ లో ఇప్పటికే కుల గణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని గుర్తు చేశారు.


Also Read: Kishan Reddy: తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ ప్రాజెక్ట్ కోసం నిధులు